రేవంత్ రెడ్డి రెండు తలల పాము కంటే డేంజర్: హరీశ్ రావు

  • డబుల్ టంగ్ లీడర్లతో ప్రమాదమన్న హరీశ్ రావు
  • ఈ నెల 7న ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ వేస్తామన్న హరీశ్ రావు
  • రాక్షసులు అన్న నోటితోనే దేవతలు అంటారని ఎద్దేవా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు తలల పాము కంటే డేంజర్ అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మనం రెండు త‌ల‌ల పామును చూసి భయపడతాం... పాపం అది ఏమీ అనదు... పెద్ద ప్ర‌మాద‌క‌రం కాదు... కానీ రెండు నాల్క‌ల ధోర‌ణి క‌లిగిన మ‌న‌షులు చాలా ప్రమాదమన్నారు. కానీ అలాంటి వారిని మనం పెద్దగా పట్టించుకోమన్నారు.

బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రెండు నాల్క‌ల వైఖ‌రికి నిద‌ర్శ‌నం నిస్సందేహంగా రేవంత్ రెడ్డే అన్నారు. రెండు వైపుల పదును కలిగిన కత్తితో కూడా జాగ్రత్తగా ఉండవచ్చు... కానీ ఈ డబుల్ టంగ్ లీడర్లతో మాత్రం చాలా ప్రమాదకరమన్నారు. సమాజానికి చాలా నష్టం చేస్తారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు... అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో... ఆ రెండు నాల్కల ధోరణి ఏమిటో వెల్లడిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ మాట తీరులో మార్పు వచ్చిందని ఆరోపించారు. ఈ నెల ఏడో తేదీన కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఛార్జీషీటు వేస్తామని తెలిపారు. సీఎం అయ్యాక కూడా ఆయ‌న మాట మార్చిన తీరును అంద‌రూ గ‌మ‌నిస్తూనే ఉన్నార‌న్నారు.

రెండు నాల్కల ధోరణిలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. మాట మార్చ‌డంలో, పూట‌కో మాట మాట్లాడ‌డంలో రేవంత్ రెడ్డి దిట్ట అన్నారు. ఆ మాట అనలేదు... ఈ మాట అనలేదంటూ ముచ్చటగా మూడో మాట చెప్పగల నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉందని ఎద్దేవా చేశారు. ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటారని, ఆ తర్వాత అదే పార్టీలో చేరి రాక్షసులు అన్న నోటితోనే దేవతలు అంటారని వ్యాఖ్యానించారు. సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

రైతు బంధు, రైతు బీమా ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కానీ కాంగ్రెస్ వీటిని పక్కన పెట్టిందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజలతో రూ.15 వేల కోట్లు కట్టించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. పేదలపై ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా చేయాలన్నారు. గతంలో తాము సమగ్ర సర్వే చేస్తే విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడెలా చేస్తున్నారని నిలదీశారు.


More Telugu News