ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల్ని కనాలన్న ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై సెటైర్లు

  • సమాజ మనుగడ కోసం సమాజ స్థిరత్వాన్ని కొనసాగించాలన్న భగవత్
  • సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తగ్గితే సమాజం అంతరించి పోతుందని ఆందోళన
  • భగవత్ వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు
  • ఆరెస్సెస్ వాళ్లు ఇక పెళ్లిళ్లు చేసుకోవడం మొదలు పెట్టాలంటున్న విపక్షాలు
ఒక్కో భారతీయ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్నికనాలన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. ఇక, ఆలస్యం ఎందుకని ఆరెస్సెస్ వాళ్లు ఆ పనిలో ఉండాలంటూ విపక్షాలు సూచిస్తున్నాయి. 

నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ‘కథాలే కుల్ సమ్మేళన్’లో భగవత్ మాట్లాడుతూ సమాజ మనుగడ కోసం జనాభా స్థిరత్వాన్ని కొనసాగించడం ముఖ్యమని చెప్పారు. జనాభా క్షీణతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఒక సమాజం సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువగా ఉన్నప్పుడు సమాజం అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. జాతిని మాయం చేస్తామనే బయటివారి బెదిరింపులు అవసరం లేదని, దానికదే అదృశ్యమవుతుందన్నారు. 

ఈ సందర్భంగా క్షీణిస్తున్న జనాభా కారణంగా ఉనికిలో లేని భాషలు, సమాజాల చారిత్రక ఉదాహరణలు చూపారు. ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 కంటే దిగువకు పడిపోకుండా చూసుకోవాలని కోరారు. జనాభా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇది ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుత జనాభా విధానం 1990, లేదంటే 2000 సంవత్సరం మొదటి నాటిదని వివరించారు. భగవత్ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు కారణమయ్యాయి. ఎక్కువమంది పిల్లల్ని కనాలని భగవత్ చెబుతున్నారని, కాబట్టి ఆరెస్సెస్ వాళ్లు ఇక పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టాలంటూ సెటైర్లు వేస్తున్నారు. 


More Telugu News