కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

  • కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్న అంజాద్ బాషా 
  • ఆరు నెలలలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నఅంజాద్
  • వక్ఫ్ బోర్డు జివో రద్దు చేయడం దుర్మార్గమన్న అంజాద్ బాషా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారన్నారు. నిధులు లేవంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కేవలం కక్షసాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనబడుతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధంగా గత ప్రభుత్వ హాయంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ జివోను ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం దుర్మార్గమన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నిక వ్యవహారం కోర్టులో ఉండగా, కమిటీకి ఐదేళ్ల పదవీ కాలం ఉండగా ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులను దురాక్రమణ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ జివో రద్దు చేశారని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదన్న కారణం చూపి రద్దు చేశామని చెప్తున్నారని, కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది టీడీపీ వారు కాదా? అని ప్రశ్నించారు.

నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 2014 -18 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డునే వేయలేదని అన్నారు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని పదవీ కాలం 2023 వరకూ ఉందని , తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాదిరిగా ఆ బోర్డును రద్దు చేయలేదన్నారు. నాడు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే జగన్ ప్రభుత్వం కొత్త బోర్డు వేయడం జరిగిందని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చిందని, దాన్ని ముస్లింలు అంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలతో పార్లమెంట్‌లో వైసీపీ దాన్ని వ్యతిరేకించిందని చెప్పారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


More Telugu News