అల్లు అర్జున్ గారూ... ఇక మీ సెంటిమెంటే మా సెంటిమెంటు: ఎంపీ బైరెడ్డి శబరి

  • ఏపీ ఎన్నికల వేళ నంద్యాల వచ్చిన అల్లు అర్జున్
  • ఆ సెంటిమెంట్ తమకు బాగా వర్కౌట్ అయిందన్న శబరి
  • నంద్యాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలంటూ సలహా
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నంద్యాల రాక తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం పోలీసు కేసు, న్యాయస్థానాల్లో పిటిషన్ల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో, టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"అల్లు అర్జున్ గారూ.... నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించినట్టుగానే... ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. 

నంద్యాలను సందర్శించాలన్న మీ సెంటిమెంటు మాకు మాత్రం బాగా వర్కౌట్ అయింది. అల్లు అర్జున్ గారూ... ఇప్పుడు మీ సెంటిమెంటే మా సెంటిమెంటు. అంతేకాదు, మీ పుష్ప-2 చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం" అంటూ బైరెడ్డి శబరి ట్వీట్ చేశారు.


More Telugu News