చాంపియన్స్ ట్రోఫీ: ఎట్టకేలకు మెత్తబడిన పాక్!

  • ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పీసీబీ కండిషన్లు
  • హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకుంటూనే పలు డిమాండ్లు పెట్టిన పీసీబీ
  • 2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరుతున్న పీసీబీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలన్న ఐసీసీ డిమాండ్‌ను పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని లేకుంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని పాక్ క్రికెట్ బోర్డుకు ఇటీవల ఐసీసీ అల్టిమేటం ఇచ్చింది. దీంతో అవసరమైతే టోర్నీని బహిష్కరిస్తామని బెదిరించిన పాక్ .. తాజాగా ఆతిథ్య హక్కుల విషయంలో కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. 

టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరిస్తూనే.. 2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని పాక్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఆర్ధిక ప్రోత్సాహకాలను కూడా పెంచాలని కోరినట్లు తెలుస్తోంది.

తమ డిమాండ్లు అంగీకరిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరిస్తామని పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లదని చెప్పిన నఖ్వీ.. ఐసీసీ బోర్డు ఆదాయాలలో వాటాను కూడా పెంచాలని కోరినట్టు సమాచారం. పాక్ డిమాండ్లపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.    


More Telugu News