పరగడపున ఈ పళ్లు తింటే.. సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

  • శరీరానికి అన్ని పోషకాలు అందాలంటే సమతుల ఆహారం తప్పనిసరి
  • ఇందులో భాగంగా రోజూ పళ్లు తీసుకోవాలంటున్న నిపుణులు
  • అయితే ఉదయం పరగడుపున కొన్ని రకాల పళ్లకు దూరంగా ఉండాలని సూచనలు
శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కూరగాయలు, పప్పులతోపాటు వివిధ రకాల పళ్లను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. నిజానికి పళ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఉదయమే పరగడుపున కొన్ని రకాల పళ్లను తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేరే ఇతర ఆహారం తీసుకున్న తర్వాత... ఆ పళ్లను తీసుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు.

సిట్రస్‌ జాతి పళ్లు 
నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్‌ జాతికి చెందిన పళ్లను పరగడుపున తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అధికంగా ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ వల్ల ఎసిడిటీ (కడుపులో మంట), అజీర్తి వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు.
మామిడి కాయలు 
మామిడి కాయల్లో యాసిడ్లు, ఫైబర్‌ ఎక్కువ. పరగడుపున వాటిని తింటే.. జీర్ణాశయం, చిన్నపేగుల్లో ఇరిటేషన్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్‌, అజీర్తికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
వాటర్‌ మెలన్స్‌ (పుచ్చకాయలు), అరటి పండ్లు
బాగా పండిన పుచ్చకాయలు, అరటి పండ్లలో చక్కెరలు ఎక్కువ. ముఖ్యంగా ఫ్రక్టోజ్‌ తరహా చక్కెర ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల అజీర్తి, వికారం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్‌ స్థాయులు వేగంగా పెరుగుతాయి.
పైనాపిల్స్‌ 
ఈ పండ్లలో బ్రొమెలీన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ప్రోటీన్లను బ్రేక్‌ డౌన్‌ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రోటీన్‌.. మన జీర్ణాశయం లోపలి కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో పైనాపిల్స్‌ తింటే... ఈ ఎంజైమ్‌ ప్రభావం ఎక్కువగా ఉండి ఇబ్బంది ఎదురవుతుంది.
బొప్పాయి పండ్లు 
పైనాపిల్స్‌ లో ఉన్నట్టుగానే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్‌ ఉంటుంది. అది కూడా బ్రొమెలీన్‌ తరహాలోనే జీర్ణాశయంలో ఇబ్బందులకు కారణం అవుతుంది.
  • ఇక పరగడుపున యాపిల్స్‌ తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • ద్రాక్ష పండ్లలోనూ చక్కెరల శాతం ఎక్కువ. పరగడుపున వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగడంతోపాటు జీర్ణ సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయి.


More Telugu News