పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉన్నా ఒప్పుకోను: సీఎం చంద్రబాబు

  • నేడు ఏపీలో పెన్షన్ల పంపిణీ
  • రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ
  • అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో చంద్రబాబు పర్యటన
ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పెన్షన్లు అందజేశారు. డిసెంబరు 1వ తేదీ ఆదివారం రావడంతో, నేడు నవంబరు 30వ తేదీనే ఇంటింటికీ తిరిగి పెన్షన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించారు. 

చంద్రబాబు నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు దివ్యాంగ పింఛను రూ.15 వేలు అందజేశారు. అదే గ్రామంలో రుద్రమ్మ అనే వితంతు మహిళ ఇంటికి కూడా వెళ్లి పెన్షన్ అందజేశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించానని వెల్లడించారు. ప్రజల్లోని ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మెరుగైన పెన్షన్ల ద్వారా వితంతువులు, దివ్యాంగులకు అండగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"అణగారిన వర్గాలకు అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. ఇప్పుడు రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ల రూపంలో ఈ ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పంపిణీ చేశాం. 

పెన్షన్ మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకునే వెసులుబాటు కల్పించాం. పెన్షను లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఈ సౌకర్యం తీసుకువచ్చాం. దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదే. పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశాను. 

పేదలకు అనేక రకాలుగా మేలు చేయాలని ఉంది... కానీ సమస్యలు చాలా ఉన్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ముందు వాటిని బాగు చేయాల్సి ఉంది" అని సీఎం చంద్రబాబు వివరించారు.

అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం: చంద్రబాబు

మీ పంటలకు నీళ్లు ఇస్తానని గతంలో ఇక్కడి రైతులకు హామీ ఇచ్చాను. రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని చెప్పాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటేశారు. అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాయదుర్గం అంటే చాలా వెనుకబడిన ప్రాంతం. రాయదుర్గం ప్రాంతం ఎడారిగా మారకుండా చర్యలు చేపట్టాం. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటాం. 

హంద్రీ నీవాపై రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు చేశాం. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం.


More Telugu News