ఫుడ్ పాయిజనింగ్ చేశాననడానికి ఆధారాలు ఉంటే కొండా సురేఖ సీబీఐకి ఇవ్వాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్న ఆర్ఎస్పీ
  • మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సురేఖపై కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని వెల్లడి
  • ఆమెకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్న ఆర్ఎస్పీ
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనుక తన హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారని, ఆధారాలు ఉంటే విచారణ కోసం సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

గురుకుల బాట అని తాము కార్యక్రమాన్ని చేపట్టగానే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నట్లు కొండా సురేఖ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు కొండా సురేఖను గతంలో తిరస్కరించారని వ్యాఖ్యానించారు. మహిళలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఆమెకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.

గతంలో తాను ఐపీఎస్ అధికారిగా పని చేశానని.. తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నారు. తాను ఏడేళ్ల సర్వీస్‌ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనపై ఆరోపణలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణకు సిద్ధమని సవాల్ చేశారు.


More Telugu News