ఆసిఫాబాద్ లో రైతుపై దాడి చేసిన పెద్దపులి

  • యువతిని చంపేసిన మరుసటి రోజే మళ్లీ దాడి
  • 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
  • పొలం పనులకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు
చేనులో పత్తి ఏరుతున్న యువతిపై దాడి చేసి మట్టుబెట్టిన మరుసటి రోజే పెద్దపులి మరోసారి దాడి చేసింది. ఈసారి ఓ రైతుపై తన పంజా విసిరింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రైతు సురేశ్ ను గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేశ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైతులు పొలం పనులకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.

సిర్పూర్ మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేశ్ పై శనివారం ఉదయం పులి దాడి చేసింది. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో పులి పారిపోయింది. ఈ దాడిలో సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి శుక్రవారం నాడు పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

దీంతో గన్నారం సహా 15 గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులిని బంధించేందుకు ఎక్కడికక్కడ బోనులు, పులి కదలికలను గుర్తించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 7 గంటలకు ముందు, సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. కొన్ని రోజుల పాటు పొలం పనులకు వెళ్లొద్దని సూచించారు.


More Telugu News