జనవరి నుంచి జనంలోకి జగన్.. క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్లాన్

  • సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తానన్న వైఎస్ జగన్
  • ప్రతి బుధ, గురువారం క్యాడర్‌తో మమేకమవుతానని చెప్పిన జగన్
  • చంద్రబాబు మోసపు మాటలు ప్రజలు గ్రహించారన్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత వారంలో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి బుధ, గురువారం జిల్లాల్లోనే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతానని తెలిపారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ పూర్తవ్వాలని సూచించారు. 
 
గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకూ సోషల్ మీడియా అకౌంట్‌లు (ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సాప్) ఉండాలని, ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే వీడియో తీసి అప్‌లోడ్ చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించిన జగన్.. ప్రతి గ్రామంలోనూ టీడీపీని, చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. 

చంద్రబాబు హామీలపై ప్రజలు ఆశపడ్డారని, కానీ ఆరు నెలలు తిరక్కమునుపే ప్రజలకు వాస్తవం అర్ధమయిందన్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోయిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు, నష్టాలు ఉంటాయి అయినా పోరాట పటిమతో ముందుకు సాగాలని క్యాడర్‌కు జగన్ సూచించారు.  
,


More Telugu News