ఆసీస్‌కు బిగ్ షాక్‌.. రెండో టెస్టుకు స్టార్ పేస‌ర్ దూరం..!

  • అడిలైడ్ ఓవ‌ల్‌లో జ‌రిగే రెండో టెస్టుకు జోష్ హేజిల్‌వుడ్ దూరం
  • గాయం కార‌ణంగా పేస‌ర్‌ను త‌ప్పించిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్ల‌డి
  • అత‌ని గైర్హాజ‌రీతో కొత్తగా సీన్ అబాట్‌, డొగ్గెట్‌కు స్క్వాడ్‌లో చోటు  
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా ఇప్ప‌టికే తొలి టెస్టులో ఓట‌మితో కంగుతిన్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు తాజాగా మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కీల‌క పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కార‌ణంగా రెండో టెస్టుకు దూరం అయ్యాడు. డిసెంబ‌ర్ 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్ వేదిక‌గా ప్రారంభ‌మ‌య్యే ఈ పింక్‌బాల్ (డే అండ్ నైట్‌) టెస్టుకు హేజిల్‌వుడ్ దూర‌మైన‌ట్లు శ‌నివారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్ల‌డించింది. 

న‌డుము కింది భాగంలో గాయం కార‌ణంగా నొప్పి ఉన్నట్టు తెలిపింది. దీంతో అత‌డిని ప‌రీక్షించిన వైద్యులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని సూచించిన‌ట్లు సీఏ పేర్కొంది. అత‌డు కోలుకునే వ‌ర‌కూ స్క్వాడ్‌తోనే ఉంటాడ‌ని, వైద్య బృందం ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని తెలిపింది. కాగా, భార‌త్‌తో తొలి టెస్టులో ఈ ఫాస్ట్ బౌల‌ర్ ఐదు వికెట్ల‌తో రాణించిన విష‌యం తెలిసిందే. 

ఇక హేజిల్‌వుడ్ గైర్హాజ‌రీతో కొత్తగా ఇద్ద‌రికి స్క్వాడ్‌లో చోటు ద‌క్కింది. సీన్ అబాట్‌, డొగ్గెట్‌ను ఎంపిక చేసింది. అటు కాన్‌బెర్రా వేదిక‌గా టీమిండియాతో జరుగుతున్న ప్రెసిడెంట్ ఎలెవ‌న్ జ‌ట్టులో ఉన్న బోలాండ్‌కు కూడా అవ‌కాశం ఉంది.  ఈ రెండు రోజుల వార్మ‌ప్ మ్యాచ్ (డే అండ్ నైట్‌)లో అత‌డు బాగా రాణిస్తే.. భార‌త్‌తో రెండో టెస్టులో ఆసీస్ తుది జ‌ట్టులో అతను ఉండే అవ‌కాశం ఉంది. 


More Telugu News