మహేష్‌ బాబు 'పుష్ప' ను మిస్‌ చేసుకున్నాడు!

  • తొలుత 'పుష్ప' కథను విన్న మహేష్‌ బాబు 
  • మహేష్‌ బాబు అంగీకారం కోసం వెయిట్‌ చేసిన సుకుమార్‌ 
  • ఫైనల్‌గా 'పుష్ప' చిత్రంలో హీరోగా అల్లు అర్జున్‌
పుష్ప.. ఇప్పుడు ఈ బ్రాండ్‌ నేషనల్‌ కాదు.. ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప ది రైజ్‌' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రానికి మంచి అప్లాజ్‌ వచ్చింది. పుష్ప.. పుష్పరాజ్‌ తగ్గేదేలే అనే ఈ సంభాషణతో పాటు ఈ చిత్రంలో పుష్పరాజ్‌ స్వాగ్‌ను  ఎంతో మంది సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా అనుకరించారు. 

ఇక తొలిపార్ట్‌కు లభించిన ఉత్సాహాంతో.. రెట్టించిన ఎనర్జీతో అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో 'పుష్ప ది రూల్‌' ను కూడా స్టార్ట్‌ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తొలిభాగానికి మించిన బిజినెస్‌ క్రేజ్‌ 'పుష్ప-2' కు వచ్చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఆహార్యం, యాస, పుష్ప రాజ్‌ స్వాగ్‌ ఇలా అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దాదాపు రూ. 1000 కోట్ల ప్రీ బిజినెస్‌ చేసుకున్న ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదల కాబోతుంది. 

ఇప్పటి వరకు 'పుష్ప-2'  నుంచి విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ల్లో పాల్గొంటూ విశేష ఆదరణతో ఈ చిత్రం పబ్లిసిటీని చేస్తున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఈ చిత్రంతో ఈ అల్లు వారసుడు దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాందించుకున్నాడు. 'పుష్ప-2'  తరువాత ఈ హీరో క్రేజ్‌, మార్కెట్‌ రెట్టింపు కానుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 'రంగస్థలం' లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్‌ తన తదుపరి చిత్రం 'పుష్ప'ను హీరో మహేశ్ బాబుతో చేయాలి. 'పుష్ప' కథను విన్న ఆయన చాలా కాలం ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్‌ కూడా మహేశ్ ఫైనల్‌ డిసిషన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న తరుణంలో మహేశ్ బాబు వేరే దర్శకుడితో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. 

ఈ సమయంలోనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', అనిల్‌ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలను అంగీకరించాడు మహేశ్. ఇక సుకుమార్‌ వెయిట్‌ చేయడం ఇష్టం లేక  'పుష్ప'  కథతో  వెంటనే అల్లు అర్జున్‌ దగ్గరికి వెళ్లిపోయాడు. కథ వినగానే బన్నీ కూడా ( అల్లు అర్జున్‌) గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. 'పుష్ప' చిత్రం అల్లు అర్జున్‌ హీరోగా సెట్స్‌ మీదకు వెళ్లింది. ఇక ఆ తరువాత 'పుష్ప' కు వచ్చిన క్రేజ్‌, 'పుష్ప-2' చిత్రానికి ఉన్న బజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


More Telugu News