శ్రీలీలకు అంతా అలా కలిసొస్తోంది.. అంతే!

  • అల్లు అర్జున్‌తో ప్రత్యేక పాటలో నర్తించిన శ్రీలీల 
  • ట్రెండింగ్‌లో శ్రీలీల 'పుష్ప-2' పాట 
  • బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌' ఏపిసోడ్‌లో శ్రీలీల సందడి


శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన తొలిచిత్రం 'పెండ్లి సందడి'తో హీరోయిన్‌ గా పరిచయమైంది కథానాయిక శ్రీలీల. ఆ చిత్రంలో ఆమె ఎనర్జీ, డ్యాన్సింగ్‌ టాలెంట్‌ చూసి హీరోయిన్‌గా వరుస అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే క్రేజీ హీరోలందరితో కలిసి నటించే అవకాశం తనను వరించింది. ముఖ్యంగా రవితేజతో ఆమె నటించిన 'ధమాకా' చిత్రం కేవలం శ్రీలీల డ్యాన్సులతోనే గట్టెక్కిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. 

డ్యాన్సుల ద్వారా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్‌లో శ్రీలీల అగ్ర జాబితాలో ఉంటారు. ఇప్పుడు అందరూ ఈమెను డ్యాన్సింగ్‌ క్వీన్‌గా పిలుచుకుంటున్నారు.  బాలకృష్ణతో భగవంత్‌ కేసరి, రామ్‌తో స్కంద, నితిన్‌తో ఎక్స్‌టార్డనరీ మ్యాన్‌ చిత్రాల్లో నటించిన ఈ అందాల తార మహేష్‌ బాబుతో నటించిన 'గుంటూరు కారం' తరువాత  సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. వరుస అపజయాలు పలకరించడంతో శ్రీలీలకు కాస్త డిమాండ్‌ తగ్గింది.  

ప్రస్తుతం నితిన్‌ సరసన రాబిన్‌హుడ్‌తో చిత్రంతో పాటు, విజయ్‌ దేవరకొండకు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు.  కాగా ఇటీవల ఈ డ్యాన్సింగ్‌ క్వీన్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప-2' చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. '' దెబ్బలు పడతాయిరో.. దెబ్బలు పడతాయి రాజా.. '' అంటూ ఈ పాటలో శ్రీలీల తన డ్యాన్సింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధం అయ్యింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటలో శ్రీలీల డ్యాన్స్‌ చూసి అందరూ ఫిదా అయిపోతారని అంటున్నారు.

 అంతేకాదు 'పుష్ప-2' విడుదల తరువాత ఈమెను మరిన్నిఅవకాశాలు వరించడం ఖాయమని చెబుతున్నారు సినీ జనాలు. అంతేకాదు ఇటీవల నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌లో కూడా శ్రీలీల పాల్గొంది. త్వరలోనే ఆ ఎపిసోడ్‌ కూడా ప్రసారం కానుంది. సో.. పుష్ప-2తో పాటు ఆహా అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ శ్రీ లీలకు కలిసొస్తుందని అంటున్నారు ఆమె సన్నిహితులు.  


More Telugu News