వీసా లేకుండానే ఈ దేశాలను చుట్టేసి రావొచ్చు!

  • ఒక్కసారైనా విదేశాలను చుట్టి రావాలనుకునే వారు ఎందరో!
  • అలా పర్యటించేందుకు అనువుగా ఉండే దేశాలెన్నో...
  • వీసా అవసరం లేకుండా.. పాస్ పోర్టు, ఆధార్ వంటివి ఉంటే చాలు కొన్ని దేశాలకు వెళ్లగలిగే అవకాశం
జీవితంలో ఒక్కసారైనా విదేశాలను చుట్టి రావాలని చాలా మందికి ఉంటుంది. అందుకోసం పాస్ పోర్టు తీసుకుంటారు. ఏ దేశానికి వెళదామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆ దేశం నుంచి వీసా తీసుకోవాల్సి వస్తుంది. అదంతా ఓ సుదీర్ఘ ప్రక్రియ. అయితే మన దేశవాసులు కొన్ని దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే వెళ్లవచ్చు. లేదా ఆ దేశంలో విమానం దిగాక అరైవల్ ఆన్ వీసా వంటివి ఇస్తుంటారు. మన దేశం నుంచి అలా వీసా లేకుండా వెళ్లగలిగిన దేశాల వివరాలు తెలుసుకుందాం...

భూటాన్
హిమాలయ పర్వత పాదాల వద్ద ఉండే అందమైన దేశం భూటాన్. అద్భుతమైన ప్రకృతి అందాలు, విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశం సొంతం. మన దేశ వాసులు పాస్ పోర్టు, తగిన ఇతర గుర్తింపుకార్డు ఉంటే చాలు భూటాన్ లో పర్యటించి రావొచ్చు.

మాల్దీవులు
అరేబియా సముద్రంలో అతి చిన్న ద్వీప దేశం మాల్దీవులు. పర్యాటకంగా బాగా పేరున్న మాల్దీవులకు భారతీయులు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావొచ్చు. అయితే ఇలా వీసా లేకుండా గరిష్టంగా 30 రోజుల వరకు ఉండటానికి అనుమతిస్తారు.

బార్బడోస్...
కరీబియన్ దేశమైన బార్బడోస్ అందమైన బీచ్ లకు, ఆహ్లాదకర వాతావరణానికి, భిన్నమైన సంస్కృతికి నిలయం. ఇక్కడ భారతీయులు వీసా లేకుండానే 30 రోజుల నుంచి 90 రోజుల వరకు పర్యటించవచ్చు.

శ్రీలంక
భిన్నమైన సంస్కృతి, మంచి వాతావరణం ఉండే శ్రీలంకలో భారతీయులు ఆరు నెలల పాటు ఎలాంటి వీసా లేకుండానే పర్యటించవచ్చు. ఈ సదుపాయం 2024 అక్టోబర్ నుంచే అందుబాటులోకి వచ్చింది.

మారిషస్...
ఈ దేశంలోనూ వీసా లేకుండా 90 రోజుల వరకు పర్యటించవచ్చు. అద్భుతమైన సముద్ర తీరాలు, అతి తక్కువ లోతు ఉండే లాగూన్ బీచ్ లు వంటివి ఈ ప్రాంత ప్రత్యేకతలు.

ఫిజీ...
తెల్లని ఇసుక ఉండే బీచ్ లు, చాలా క్లియర్ గా ఉండే సముద్ర తీరంతో పాటు ఎన్నో ప్రకృతి అందాలు ఫిజీలో ఉన్నాయి. ఇక్కడ 120 రోజుల పాటు వీసా లేకుండా గడపవచ్చు.

వనౌటు
ఈ దేశంలో 30 రోజుల వరకు వీసా లేకుండా పర్యటించవచ్చు. దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో ఉండే ఈ దేశం అద్భుతమైన కోరల్ రీఫ్ లు, బీచ్ లు, విభిన్నమైన సంస్కృతికి నిలయం.

ఎల్ సాల్వెడార్...
విభిన్నమైన సంస్కృతికి నిలయమైన ఎల్ సాల్వెడార్ లో 180 రోజుల వరకు వీసా లేకుండా పర్యటించవచ్చు.

సీ షెల్స్...
హిందూ మహా సముద్రంలోని అద్భుతమైన బీచ్ లు, క్లియర్ గా ఉండే సముద్రపు నీళ్లు, అడవులు, ప్రకృతి సంపద ఈ దేశం సొంతం. ఇక్కడ భారతీయులు 30 రోజుల పాటు వీసా లేకుండా పర్యటించవచ్చు.

వీటితోపాటు ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ వంటి దేశాల్లోనూ వీసా లేకుండా పర్యటించవచ్చు. ఈ రెండు దేశాలు కూడా ప్రకృతి అందాలకు నిలయమే.


More Telugu News