భరతనాట్యం చేసిన ఏనుగు?.. వీడియో ఇదిగో!

  • ఇద్దరు యువతుల భరతనాట్యం
  • వారి డ్యాన్స్‌కు అనుగుణంగా తల, తొండం ఊపుతూ కనిపించిన ఏనుగు
  • అది డ్యాన్స్ కాదన్న ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్యప్
  • ఏనుగులు ఒత్తిడిలో ఉన్నప్పుడు అలానే కదులుతాయంటూ మరో వీడియోను షేర్ చేసిన అధికారి
ఏనుగు భరతనాట్యం చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు భరతనాట్యం చేస్తుండగా వెనక వారిని చూస్తున్న ఏనుగు కూడా తొండం ఊపుతూ వారి నాట్యానికి అనుగుణంగా తలవూపుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఒకరు స్పందిస్తూ.. వీడియోలో మనకు కనిపించే దానికి మించి ఏనుగు కదులుతూ ఉండొచ్చని, వాస్తవానికి అది ఒత్తిడికి గురై ఉండొచ్చని పేర్కొన్నారు. 

ఆ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు యువతులు అలా బహిరంగంగా ఎందుకు భరతనాట్యం చేస్తున్నారని మరికొందరు ప్రశ్నించారు. వారు నాట్యం చేస్తున్న వెనకవైపు ఓ స్తంభానికి కట్టేసి ఉన్న ఏనుగు యువతుల డ్యాన్స్‌ను అనుసరిస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఏనుగు డ్యాన్స్‌ను ప్రశంసిస్తూ వందలాదిమంది కామెంట్లు చేస్తున్నారు. 

డ్యాన్స్ వెనక వాస్తవం ఇదీ
వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్ మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్టు అది ఆనందంతో డ్యాన్స్ చేయడం లేదని, అది ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. జంతువులపై దయగా ఉండాలని చెబుతూ మరో వీడియోను షేర్ చేశారు. ఒత్తిడిలో ఉన్న  ఏనుగు డ్యాన్స్ చేస్తున్నట్టుగా అటూఇటూ కదలడం, తొండం ఊపడం ఆ వీడియోలో కనిపించింది. సాధారణంగా ఏనుగులు ఒత్తిడి గురైనప్పుడు, విసుగు చెందినప్పుడు లేదంటే చిన్న ఆవరణలో గొలుసులతో కట్టేసి అసహజ వాతావరణంలో బంధించినప్పుడు అవి ఇలానే ప్రవర్తిస్తాయి. స్టీరియోటైపిక్ బిహేవియర్ అనే ఈ ప్రవర్తన సాధారణంగా కదిలే అవకాశం లేని, బంధించే ఏనుగులలో కనిపిస్తుంది.  


More Telugu News