‘నాడా’ బ్యాన్ పై బజరంగ్ పూనియా సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీలో చేరితే ఏ నిషేధమూ ఉండదన్న రెజ్లర్
  • ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందని ఆరోపణ
  • తాను తలవంచబోనని, పోరాటం ఆపబోనని స్పష్టం చేసిన పూనియా
ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల పాటు బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంపై పూనియా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం తనతో పాటు మరికొందరు రెజ్లర్లను టార్గెట్ చేసి, అధికారుల ద్వారా వేధిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తమ గొంతు నొక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ తాను తలవంచబోనని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరితే తనపై ఎలాంటి కేసులు, నిషేధాలు ఉండవని చెప్పారు.

వేధింపులకు గురైన మహిళలకు, అన్నదాతల పోరాటానికి మద్దతుగా నిలిచిన నాటి నుంచే ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందన్నారు. డోప్ టెస్ట్ కోసం నమూనాలు ఇవ్వడానికి నిరాకరించారనే ఆరోపణలపై పూనియా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. 2023 డిసెంబర్ లో డోప్ టెస్ట్ నమూనాల కోసం ఓ బృందం తన నివాసానికి వచ్చిందన్నారు. అయితే, వాళ్లు తీసుకువచ్చిన టెస్టింగ్ కిట్స్ అప్పటికే ఎక్స్ పైరీ అయిపోయాయని చెప్పారు.

ఈ విషయాన్ని ఆ రోజే తాను వీడియోలో చూపించానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని పూనియా వివరించారు. వచ్చిన వారి దగ్గర ఐడీ కార్డ్స్ లేవన్నారు. ఆ సమయంలో తాను ఓ పోటీలో ఉన్నానని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం ఓ టోర్నమెంట్ జరుగుతుండగా ఏ ఆటగాడి వద్దా నమూనాలు స్వీకరించడం కుదరదని, అదే విషయాన్ని వారికి చెప్పి తన మ్యాచ్ పూర్తయ్యాక వేరే కిట్స్ తీసుకుని రమ్మన్నానని పూనియా వివరించారు. నాడా తనపై విధించిన బ్యాన్ పై చట్టపరంగా పోరాడతానని, ఎవరికీ తలవంచబోనని బజరంగ్ పూనియా చెప్పారు.


More Telugu News