సీఐడీ ఆఫీసుకు వెళ్లిన రఘురామ నడవలేని స్థితిలో బయటికి వచ్చారు: ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్... గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
  • రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించారన్న ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్
  • రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టారని వెల్లడి
  • ఆ వీడియోలు పెద్దలకు పంపారని వివరణ
  • ఆ పెద్దలెవరో త్వరలో తెలుస్తుందని స్పష్టీకరణ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వం హయాంలో రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన సీఐడీ... విచారణ సందర్భంగా చిత్రహింసలు పెట్టినట్టు కేసు నమోదవడం తెలిసిందే. ఈ కేసులో అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణ అనంతరం విజయపాల్ ను అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. 

నేడు విజయపాల్ ను కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. విజయపాల్ ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించారని వెల్లడించారు. సీఐడీ ఆఫీసుకు వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో బయటకు వచ్చారని వివరించారు. రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టారని తెలిపారు. రఘురామను చంపడానికి కూడా ప్రయత్నించారని వి.రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. 

తనపై దాడి విషయాన్ని రఘురామకృష్ణరాజు కోర్టుకు వివరించారని పేర్కొన్నారు. నాడు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా నిందితులేనని అన్నారు. మిలిటరీ ఆసుపత్రి నివేదిక ప్రకారం రఘురామ శరీరంపై గాయాలు ఉన్నాయని వెల్లడించారు. 

రఘురామను వేధించిన కేసులో 27 మందిని విచారించామని చెప్పారు. నాడు రఘురామను చిత్రహింసలు పెట్టిన సందర్భంగా ఉన్న వారందరినీ తాము విచారించామని, ఆయనపై దాడి జరిగిన మాట యథార్థమేనని నిర్ధారణకు వచ్చామని తెలిపారు. 

రఘురామను వేధించడాన్ని వీడియో కూడా తీశారని, అప్పటి పెద్దలకు రఘురామను వేధించిన వీడియోలు పంపించారని వి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆ పెద్దలు ఎవరనేది త్వరలో తేలుతుందని స్పష్టం చేశారు.


More Telugu News