నేడు తమిళనాడును తాకనున్న ఫెంగల్ తుపాను.. స్కూళ్లు మూత

  • నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
  • తీవ్ర రూపం దాల్చి నేడు తుపాను బలపడే అవకాశం
  • తమిళనాడు వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి నేడు తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ తుపానుకు ‘ఫెంగల్’గా నామకరణం చేసింది. సైక్లోన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మయిలాదుతురై, తిరువారూర్, నాగపట్టణం, చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పేట్, కడలూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) పేర్కొంది. దీంతో చెన్నై, చెంగల్‌పట్, కడలూర్, మయిలాదుతురై ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది 

నాగపట్టణం, మయిలాదుతురై, తిరువారూర్‌ ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడలూర్, మయిలాదుతురైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ నిన్ననే రెడ్ అలెర్ట్ జారీచేసింది. చెన్నైలో నేటి వరకు ఎల్లో అలెర్ట్ జారీచేయగా, పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్‌పట్‌లకు బుధ, శనివారాల మధ్య ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. 


More Telugu News