సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

  • సీఎం అవగాహనారాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్న
  • అదానీకి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులను తమకు ఆపాదిస్తున్నారని ఆగ్రహం
  • చిట్టినాయుడి చిప్ దొబ్బినట్లుగా ఉందని ఎద్దేవా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదానీకి తాము కొన్ని ప్రాజెక్టులు కట్టబెట్టినట్లు ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు. సీఎం అవగాహనారాహిత్యంతో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. అదానీ కొన్ని ప్రతిపాదనలను తమ ముందుకు తీసుకువస్తే నాటి సీఎం కేసీఆర్ తిరస్కరించారన్నారు. అదానీకి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే... రేవంత్ రెడ్డి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా నిరాశ, నిసృహతో కనిపించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో తనను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడన్నారు. రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, ఇక కావాల్సినంత దోపీడి జరుగుతోందన్నారు. అయినప్పటికీ తమను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడి చిప్ దొబ్బినట్లుగా అనిపించిందన్నారు. జాతీయ ప్రాజెక్టులను తాము అదానీకి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ... వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఎవరూ విశ్వసించడం లేదన్నారు. రక్షణ శాఖ ఇచ్చిన ప్రాజెక్టులను తమకు ఆపాదిస్తున్నారని... మరి రాజ్‌నాథ్ సింగ్ ఏం చేస్తున్నట్లు అని చురక అంటించారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులను తాము ఇచ్చినట్లుగా చెప్పడం ఏమిటన్నారు. చిట్టినాయుడు ఓ మూర్ఖుడు అని... ఆయన ఎవరు చెప్పినా వినరని ఎద్దేవా చేశారు.

తమ హయాంలో మైక్రోసాఫ్ట్ నుంచి పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను తాము తీసుకు వస్తే అదానీ డేటా సెంటర్ అని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సబ్జెక్ట్ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ గౌరవం తగ్గుతుందన్నారు.

తానేదో అదానీని కలిశానని రేవంత్ రెడ్డి ఫొటో రిలీజ్ చేశారని, తాను దావోస్‌లో ఆయనను కలిశానని, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశానని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డిలా ఇంటికి పిలిపించుకొని నాలుగు గంటలు రహస్యంగా మాట్లాడలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డిలా కాళ్లు పట్టుకొనే పనులు తాము చేయలేదన్నారు. కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం పని చేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రేవంత్ రెడ్డి ఓ శాడిస్ట్ సీఎం అని విమర్శించారు.


More Telugu News