ఆస్ట్రేలియా టూర్ నుంచి అత్యవసరంగా భారత్ బయలుదేరిన గంభీర్

  • కుటుంబ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి గంభీర్
  • రెండో టెస్టు నాటికి మళ్లీ ఆస్ట్రేలియాకు 
  • పింక్‌బాల్ టూర్ గేమ్ కోసం రేపు కాన్‌బెర్రాకు టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అత్యవసరంగా ఇంటికి బయలుదేరినట్టు తెలిసింది. కుటుంబ సంబంధమైన అత్యవసర పరిస్థితుల కారణంగానే గంభీర్ స్వదేశానికి వస్తున్నట్టు సమాచారం. అయితే, అడిలైడ్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు (డే-నైట్ టెస్ట్) నాటికి ఆయన మళ్లీ ఆస్ట్రేలియా చేరుకునే అవకాశం ఉంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు జరగనుండగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది. ఈ టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులోకి దూసుకెళ్లింది. రోహిత్ జట్టు రేపు రెండ్రోజుల పింక్‌బాల్ టూర్ గేమ్ కోసం కాన్‌బెర్రా వెళ్లనుంది. కాగా, భారత్ వెళ్లనున్న గంభీర్ శనివారం నాటి భారత జట్టు ప్రాక్టీస్‌కు అందుబాటులో ఉండడని టీమిండియా వర్గాలు తెలిపాయి. 


More Telugu News