ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు?.. చర్చనీయాంశంగా మారిన హేజిల్‌వుడ్ వ్యాఖ్యలు

  • హేజిల్‌వుడ్ వ్యాఖ్యలపై మాజీ దిగ్గజం గిల్‌క్రిస్ట్ సందేహాలు
  • గేమ్ ప్లాన్ గురించి బ్యాటర్లను అడగాలన్న హేజిల్‌వుడ్
  • పెర్త్ టెస్ట్ మూడవ రోజు ఆట ముగిశాక ఆసక్తికర వ్యాఖ్యలు
  • డ్రెసింగ్‌ రూమ్ లో ఐక్యతపై గిల్‌‌క్రిస్ట్ అనుమానాలు
పెర్త్ వేదికగా భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు ఏర్పడ్డాయా?. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడం లేదా?.. అంటే ఔననే సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్. నాలుగవ రోజును అనుసరించే గేమ్ ప్లాన్ ఏమిటని పేసర్ జాస్ హేజిల్‌వుడ్‌ను ప్రశ్నించగా... బహుశా ఆ ప్రశ్నను బ్యాటర్లలో ఒకర్ని అడగాలని అతడు సమాధానమివ్వడం అనుమానాస్పదంగా ఉందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

‘‘ఈ బ్యాట్స్‌మెన్లను కాదని ఏం ప్లాన్ చేయగలం. నేను విశ్రాంతి తీసుకోవచ్చు. చిన్నపాటి ట్రీట్‌మెంట్ కూడా తీసుకోవాలి. బహుశా నేను తదుపరి టెస్ట్‌ కోసం ఎదురుచూస్తుంటాను’’ అని హేజిల్‌వుడ్ చెప్పాడని, పెర్త్ టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన మూడవ రోజు ఆట ముగిసిన తర్వాత అడగగా ఇలా స్పందించడం చూస్తుంటే డ్రెసింగ్ రూమ్‌లో విభేదాలకు అవకాశం ఉన్నట్టు అనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశాడు. అయితే విభేదాలు నిజంగా ఉన్నాయో లేవో తనకు తెలియదని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. తాను అతిగా అభివర్ణిస్తుండవచ్చు అని పేర్కొన్నాడు.

పెర్త్ టెస్ట్‌లో నాల్గవ రోజు ఆట సందర్భంగా ‘ఫాక్స్ స్పోర్ట్స్‌’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘బ్యాటర్లు ఏం చేయాలనుకుంటున్నారో దానికే కట్టుబడి ఉంటున్నారని నేను ఊహిస్తున్నాను. ఉదయాన్నే చర్చిస్తారని భావిస్తున్నా. మ్యాచ్‌లో ఎలా ముందుకు సాగాలి, ఎలా మెరుగుపడాలనే ప్రణాళికల గురించి మాట్లాడతారని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

హేజిల్‌వుడ్ వ్యాఖ్యల నుంచి అర్థం చేసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? అని మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ని గిల్‌క్రిస్ట్ ప్రశ్నించాడు. అప్పుడు వార్నర్ స్పందిస్తూ.. ఒక సీనియర్ ఆటగాడిగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని హేజిల్‌వుడ్‌కు సలహా ఇచ్చాడు. బ్యాటర్లు అందరూ బ్యాటింగ్ గురించి ఆలోచిస్తుంటారని అన్నాడు. పెర్త్ టెస్టులో బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు కాబట్టి ఒక సీనియర్ బౌలర్‌గా జట్టుకు మద్దతు ఇవ్వాలని, హేజిల్‌వుడ్ వ్యాఖ్యలు బహుశా అలాంటి భరోసా ఇవ్వవని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. జట్టు వైపు వేళ్లు చూపిస్తుండవచ్చు, కానీ డ్రెసింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నాయని తాను భావించడం లేదని వార్నర్ అభిప్రాయపడ్డాడు.


More Telugu News