వారి సలహా విని ఉంటే ప్రశాంతత, డబ్బు కోల్పోయి ఉండేవాడిని.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

  • 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్
  • అభిమానులతో సభలు, సమావేశాల నిర్వహణ
  • ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి రాబోవడం లేదని ప్రకటన
  • అప్పట్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్న రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కొందరు తనకు ఇచ్చిన సలహా పాటించి ఉంటే ఈపాటికి మానసిక ప్రశాంతతోపాటు బోల్డంత డబ్బును కూడా కోల్పోయి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. 2017లో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అభిమానులతో సభలు, సమావేశాలు నిర్వహించారు. తమిళనాట ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టి రజనీ గెలుపు నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు. ఒకానొక సమయంలో బీజేపీ ఆయనతో జత కట్టేందుకు కూడా సిద్ధమైంది. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ వెనకడుగు వేశారు. రాజకీయాల్లోకి రాబోవడం లేదని ప్రకటించారు.

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ‘‘రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించిన తర్వాత నేను చాలామందిని కలిశాను. ఆ సమయంలో నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. వాటిని కనుక నేను పాటించి ఉంటే ప్రశాంతత, డబ్బును పోగొట్టుకుని ఉండేవాడిని. అయితే, వారు ఆ సలహా తెలిసి ఇచ్చారో, తెలియక ఇచ్చారో నాకు తెలియదు’’ అని పేర్కొన్నారు. అయితే, అది ఎలాంటి సలహా, ఎవరు ఇచ్చారన్న విషయాన్ని మాత్రం రజనీకాంత్ బయటపెట్టలేదు.


More Telugu News