స్టాక్ మార్కెట్లలో ఎన్డీయే ‘మహా’ గెలుపు జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • ఆరంభంలో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా, నిఫ్టీ 405.5 పాయింట్ల వృద్ధి
  • లాభాల్లో పయనిస్తున్న అన్ని రంగాల సూచీలు
  • 4 శాతం మేర బలపడ్డ అదానీ కంపెనీల షేర్లు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు కూడా సానుకూలంగా ఉండడంతో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇవాళ (సోమవారం) భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. సెషన్ ఆరంభంలో సెన్సెక్స్ సూచీ 1287.45 పాయింట్లు వృద్ధి చెంది 80,404.45 స్థాయికి పెరిగింది. ఇక నిఫ్టీ-50 సూచీ 405.5 పాయింట్లు పెరిగి 24,315.75 పాయింట్లకు చేరింది. ఉదయం 10.15 గంటల సమయానికి లాభాలు స్వల్పంగా తగ్గి సెన్సెక్స్ 80,210.60 వద్ద, నిఫ్టీ 24,268.50 వద్ద కదలాడుతున్నాయి. 

అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్, మీడియా, టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ రంగాల సూచీలు 1-2 శాతం మేర లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, మహింద్రా అండ్ మహింద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బీపీసీఎల్ షేర్ల టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. కాగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారీగా క్షీణించింది. 

పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదయినప్పటికీ అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల స్టాక్స్ ఈ రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిరాధారమైన ఆరోపణలు అంటూ కంపెనీ ప్రకటన విడుదల చేయడం సానుకూలంగా మారింది. దాదాపు 4 శాతం మేర లాభాల్లో పయినిస్తున్నాయి.

మరోవైపు.. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పెరిగింది. ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడం సానుకూలంగా మారింది. దీంతో ట్రేడింగ్ ఆరంభంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6 పైసలు పెరిగి 84.35 స్థాయికి మెరుగైంది.


More Telugu News