ఈరోజు కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ

  • గతంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన వర్మ
  • పలు చోట్ల వర్మపై నమోదైన కేసులు
  • విచారణకు హాజరు కావాలంటూ వర్మకు పోలీసుల నోటీసులు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒంగోలు రూరల్ పీఎస్ లో పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈరోజు కూడా ఆయన విచారణకు డుమ్మాకొట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను వర్మ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై పలు చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో ఈ నెల 19న విచారణకు హాజరుకావాలంటూ ఏపీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే షూటింగ్ పనుల్లో తాను బిజీగా ఉన్నానని... తనకు వారం రోజుల సమయం కావాలని ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, 25వ తేదీన హాజరు కావాలని ఈ నెల 20న ఆయనకు మరోసారి నోటీసులిచ్చారు. 

అయితే, ఈరోజు విచారణకు కూడా వర్మ డుమ్మాకొట్టారు. విచారణకు హాజరుకావడానికి తనకు మరింత సమయం కావాలంటూ ఆయన తన న్యాయవాది ద్వారా ఒంగోలు రూరల్ సీఐకి సమాచారం పంపించారు. మరోవైపు వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది.


More Telugu News