లగచర్లలో ప్రజలు తిరగబడడంతో ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చారు: హరీశ్ రావు

  • లగచర్లలో ఏర్పాటయ్యేది ఇండస్ట్రియల్ కారిడార్ అన్న హరీశ్ రావు
  • మండిపడిన హరీశ్ రావు
  • కాంగ్రెస్ ఏడో గ్యారంటీ ఇక్కడ ఖూనీ అయిందని వ్యాఖ్యలు
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఏర్పాటయ్యేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. 

లగచర్లలో ప్రజలు, రైతులు తిరగబడడంతో ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇక్కడ ఖూనీ అయిందని పేర్కొన్నారు. లగచర్లకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వెళ్లనివ్వడంలేదని ఆరోపించారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో గెజిట్ కూడా ఇచ్చారని, ప్రజాగ్రహం రావడంతో ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారని దుయ్యబట్టారు.  

మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడంలేదని ధ్వజమెత్తారు. బాండ్ పేపర్లపై రాసిచ్చి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండో విడత దళిత బంధు డబ్బులు అడిగితే దళితులపై దాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.

ఇవాళ హుజూరాబాద్ లో హరీశ్ రావు మీడియా సమావేశం ఈ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత హుజూరాబాద్ జర్నలిస్టులతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు ప్రచారం చేయడంలో డబుల్ పీహెచ్ డీ ఇవ్వొచ్చని ఎద్దేవాచేశారు. పట్టపగలు గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడని అన్నారు. 

"కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో మోసం చేశారు. మహారాష్ట్రలోనూ గ్యారెంటీ పేరుతో మోసం చేయబోయారు. అక్కడకు వెళ్లి మహిళలకు మూడు వేలు, రైతులకు రుణమాఫీ చేస్తాం అన్నారు. సీఎం, మంత్రులు వెళ్లి ప్రచారం చేశారు. వీరిని చూస్తే తెలంగాణలో చేసిన మోసం గుర్తించారు... ఆ మోసాన్ని గ్రహించారు... ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. నూటొక్క దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మోసం చేశారు" అని విమర్శించారు. 



More Telugu News