నా సొంత నియోజకవర్గ ప్రజల్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను?: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు... ఇండస్ట్రియల్ కారిడార్ అన్న సీఎం
  • నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని వెల్లడి
  • భూసేకరణ పరిహారం పెంపును కూడా పరిశీలిస్తామని హామీ
నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని వెల్లడించారు. లగచర్ల ఘటనపై నేడు వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం సీఎంకు వినతి పత్రం అందించింది. 

ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ... కొడంగల్ నియోజకవర్గంలో యువతీయువకులకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమన్నారు. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణ పరిహారం పెంపును కూడా పరిశీలిస్తామని వెల్లడించారు.

భూసేకరణ నేపథ్యంలో గురువారం నాడు వామపక్ష పార్టీల నేతలు వికారాబాద్ జిల్లా లగచర్ల, రోటితండాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను వారు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.

రైతు సదస్సును మూడ్రోజులు నిర్వహించండి

ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్‌లో నవంబర్ 30న జరగనున్న రైతు సదస్సులో అధిక సంఖ్యలో రైతులు పాల్గొనేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇది బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా ఉండాలన్నారు. నేడు ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయంలో వస్తున్న ఆధునాతన సాగు పద్ధతులను, మెలకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు అప్పటికప్పుడు వచ్చి వెళ్లేలా కాకుండా వారికి అవగాహన కల్పించేలా మూడ్రోజుల పాటు సదస్సు నిర్వహించాలన్నారు. అందుకే ఈ స్టాల్స్‌ను 28వ తేదీ నుంచి అందుబాటులో ఉంచాలన్నారు.


More Telugu News