తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను గుర్తించే... మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు: హరీశ్ రావు

  • 5 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని వెల్లడి
  • తెలంగాణలో హామీల విషయంలో మోసం చేశారని విమర్శ
  • ఇది మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపిందన్న హరీశ్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 5 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు.

తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రైతు భరోసా ఎగ్గొట్టారని, ఆసరా ఇవ్వకుండా దోఖా (మోసం) చేశారని, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించారు.

తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పుణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ ఇక్కడ చేసిన మోసాల గురించి మహారాష్ట్రలో చాలా ప్రచారం జరిగిందని తెలిసిపోతోందని పేర్కొన్నారు.

అలాగే, హేమంత్ సోరేన్‌పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీని చీల్చే ప్రయత్నాలను చూసిన ఝార్ఖండ్ ప్రజలు బీజేపీని తిప్పికొట్టారని రాసుకొచ్చారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలను ప్రజలు హర్శించడం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. విజయం సాధించిన హేమంత్ సోరెన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News