పెర్త్ టెస్టులో పాంచ్ పటాకా... కపిల్ దేవ్​ సరసన కెప్టెన్ జ‌స్ప్రీత్‌ బుమ్రా!

  • 'సేనా' దేశాలపై అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు
  • ఈ ఘనతతో కపిల్ దేవ్ సరసన బుమ్రా
  • 'సేనా' దేశాలపై కపిల్, బుమ్రా ఏడు సార్లు 5 వికెట్లు సాధించిన వైనం
  • ఐదో భార‌త సార‌థిగా జ‌స్ప్రీత్‌ బుమ్రా మ‌రో రికార్డు
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన స్టార్ పేస‌ర్‌... 'సేనా' (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ సరసన బుమ్రా నిలిచాడు. 

ఈ దేశాలపై ఇరువురు ఏకంగా ఏడు సార్లు ఐదు వికెట్ల ఫీట్‌ను న‌మోదు చేశారు. బీఎస్ చంద్రశేఖర్ (6), జహీర్ ఖాన్ (6), బిషన్ సింగ్ బేడీ (5), అనిల్ కుంబ్లే (5) 'సేనా' (SENA) దేశాలపై 5 వికెట్లు తీశారు. వీరిని అధిగమించి బుమ్రా కపిల్ సరసన చేరాడు. 

కానీ, మ్యాచుల‌ పరంగా చూస్తే బుమ్రానే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించాడు. అత‌డు కేవ‌లం 51 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధిస్తే... కపిల్ దేవ్ 62 మ్యాచుల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. 

నాటింగ్‌ హామ్, కేప్‌టౌన్ వేదికల్లో రెండు సార్లు, జొహెన్నెస్‌ బర్గ్, మెల్‌ బోర్న్, పెర్త్‌లో ఒక్కోసారి బుమ్రా ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇక టెస్టు కెరీర్‌లో ఈ స్టార్ పేస‌ర్‌ ఓవరాల్ గా ఓ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం ఇది 11వ సారి.

అలాగే ఆసీస్‌ గడ్డపై టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. 8 మ్యాచుల్లోనే 37 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ 51 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంటే... అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐదో భార‌త సార‌థిగా జ‌స్ప్రీత్‌ బుమ్రా మ‌రో రికార్డు

అలాగే వినూ మన్కడ్ (1), బిషన్ బేడీ (8), కపిల్ దేవ్ (4), అనిల్ కుంబ్లే (2) తర్వాత టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన భారత కెప్టెన్లలో ఐదో వాడిగా జ‌స్ప్రీత్‌ బుమ్రా నిలిచాడు. 2007లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో కుంబ్లే (5/84) ఈ ఘనత సాధించిన చివరి భారత కెప్టెన్. మళ్లీ ఆ పాంచ్ పటాకా ఫీట్‌ను కెప్టెన్‌గా ఇప్పుడు బుమ్రా సాధించాడు.


More Telugu News