హ్యాట్రిక్ సెంచ‌రీల‌తో తిల‌క్ వ‌ర్మ న‌యా రికార్డ్‌!

  • రాజ్‌కోట్‌లో మేఘాలయతో హైదరాబాద్ టీ20 మ్యాచ్‌
  • కేవ‌లం 67 బంతుల్లోనే 151 పరుగులు చేసిన తిల‌క్ వ‌ర్మ‌
  • టీ20ల‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డ్‌
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైద‌రాబాద్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్న యువ ఆట‌గాడు  
టీమిండియా ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ టీ20 క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. దీంతో టీ20ల్లో హ్యాట్రిక్ శ‌త‌కాలు న‌మోదు చేసిన‌ తొలి భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డుకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆట‌గాడు స్వైర‌విహారం చేశాడు. 

హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న తిలక్  ఓపెనర్‌గా బ‌రిలోకి దిగి, కేవ‌లం 67 బంతుల్లోనే 151 పరుగులు చేశాడు. ఇందులో 14 బౌండ‌రీలు, 10 సిక్స‌ర్లు ఉన్నాయి. 225.6 స్ట్రైట్‌రేట్‌తో బ్యాటింగ్ చేయ‌డం విశేషం. తిలక్ కేవ‌లం 18 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. దీంతో తిల‌క్ విధ్వంసం ఎలా కొన‌సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. 

కాగా, 22 ఏళ్ల తిలక్ దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా ఆడిన‌ మూడు, నాలుగు మ్యాచుల్లో వరుసగా సెంచరీలు బాదిన విష‌యం తెలిసిందే. సెంచూరియన్‌లో 107 నాటౌట్, జోహన్నెస్‌బర్గ్‌లో కూడా అజేయంగా 120 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను దేశవాళీ టీ20ల్లో కొన‌సాగిస్తూ హ్యాట్రిక్ శ‌త‌కం న‌మోదు చేశాడు. 

అలాగే అతను టీ20లలో 150 ప్లస్ స్కోరు చేసిన మొదటి భారతీయ పురుష క్రికెటర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న కిరణ్ నవ్‌గిరే 2022లో జరిగిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై నాగాలాండ్ తరఫున ఆడుతూ అజేయంగా 162 పరుగులు చేశారు. 


More Telugu News