అడవిలో పులి మాదిరిగా భావించుకుంటా.. తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • చేతిపై ఉన్న పచ్చబొట్టు విశేషాలు పంచుకున్న యువ క్రికెటర్
  • టాటూని చూసినప్పుడల్లా యోధుడిగా భావించుకుంటానని వెల్లడి
  • ఆట కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు రాజులా ఉండాలన్న నితీశ్ కుమార్ రెడ్డి
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. పెర్త్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆడుతున్నారు. లెజెండ్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ అవ్వగా... 41 పరుగులతో నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ‘7 క్రికెట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చేతిపై ఉన్న పచ్చబొట్టుకు సంబంధించిన విశేషాలను వెల్లడించాడు.

తన చేతిపై ఉన్న టాటూ ‘యోధుడు’, ‘పులి’ని సూచిస్తుందని నితీశ్ రెడ్డి చెప్పాడు. ‘‘పచ్చబొట్టు యోధుడిని, పులిని ప్రతిబింబిస్తుంది. ఆట కేంద్ర స్థానంలో నేను ఆడుతున్న సమయంలో ఈ టాటూను చూసినప్పుడల్లా నన్ను నేను యోధుడిగా భావించుకుంటాను. ఒక పులి అడవిలో తన భూభాగాన్ని ఏర్పరచుకుంటే అందులోకి ఏ ఇతర జంతువుల్ని లేదా దేనినీ లోపలికి రానివ్వదు. పులికి మాదిరిగా నేను కూడా అలాంటి అనుభూతి చెందాలనుకుంటున్నాను. ఆట కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు రాజులా ఉండాలి. నేను కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు.

కాగా అరంగేట్ర మ్యాచ్‌ అయిన పెర్త్ టెస్ట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. టీమిండియా కేవలం 73 పరుగులకే 6 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 పరుగులు సాధించి భారత్ 150 పరుగుల మైలురాయిని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలావుంచితే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి ఆడుతున్న విషయం తెలిసిందే.


More Telugu News