మహారాష్ట్రలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారీటీ.. 194 సీట్లలో లీడ్

  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కొనసాగుతున్న ట్రెండ్
  • మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే
  • ముఖ్యమంత్రీ సీటు కోసం కూటమి నేతల మధ్య పోటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 194 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా గెలుచుకునే ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పడనుందని తేలిపోయింది. అయితే, కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (షిండే వర్గం) చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ (అజిత్ వర్గం) చీఫ్ అజిత్ పవార్ లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయా పార్టీల్లో కిందిస్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం స్పందిస్తూ.. ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చుని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా, శనివారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీయే కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. బారామతిలో పవార్ కుటుంబ పోటీలో అజిత్ ముందున్నారు.


More Telugu News