దొంగల నుంచి 2 కోట్ల విలువైన ఐఫోన్ల స్వాధీనం.. నిందితుల అరెస్ట్

  • రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘటన
  • స్నేహితుడు మొబైల్ షోరూం ప్రారంభించినట్టు తెలుసుకున్న పాత స్నేహితుడు
  • అప్పుడే చోరీకి ప్లాన్.. స్నేహితులతో కలిసి దోపిడీ
  • వాటిని కొనుగోలు చేసిన ముంబై వ్యక్తి
  • ఐఫోన్లను బంగ్లాదేశ్ స్మగ్లింగ్ చేసే ప్లాన్ 
  సెల్‌ఫోన్ షోరూం నుంచి ఐఫోన్లు దొంగిలించి వాటిని బంగ్లాదేశ్‌కు తరలించేందుకు సిద్ధమైన ముఠాను రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2 కోట్ల విలువైన ఐఫోన్లు, రూ. 3.85 కోట్ల నగదు, దొంగతనానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఒకడైన సఫన్ ఖాన్ మొబైల్ షాప్ యజమాని రమీంద్రసింగ్ మఖీజాకు పాత స్నేహితుడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మఖీజా పదేళ్ల క్రితం ఇండోర్‌లో పనిచేసేందుకు వెళ్లినప్పుడు నిందితుడితో పరిచయం ఏర్పడింది. బాధితుడు జైపూర్‌లో మొబైల్ షోరూం ప్రారంభించిన విషయం తెలిసి అతడిని కలిసేందుకు వచ్చిన సఫన్‌ఖాన్ అప్పుడే దోపిడీకి ప్రణాళిక రచించాడు. ఆ వెంటనే ముంబైలోని తన స్నేహితులను సంప్రదించారు. అందరూ కలిసి చోరీ చేసిన ఐఫోన్లను బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించారు. 
 
జైపూర్‌లోని పంచవటి సర్కిల్‌లో ఉన్న మఖీజా మొబైల్ షోరూంలో ఈ నెల 6న దొంగలు పడ్డారు. మాస్క్ ధరించిన ముగ్గురు దొంగలు తొలుత షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించారు. 120 ఐఫోన్లు, 150 పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్‌లు, షోరూంలోని ఇతర వస్తువులు దొంగిలించారు. వీటి విలువ రూ. 2 కోట్లు ఉంటుందని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు. 

ఫోన్లు చోరీ చేసిన దొంగలు తొలుత బైక్‌పై పరారయ్యారు. 50 కిలోమీటర్లు వెళ్లాక అక్కడ దానిని వదిలేసి అక్కడి నుంచి కారులో వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు. కారు నంబర్ ఆధారంగా దానిని మధ్యప్రదేశ్‌లో అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు. 

ఈ క్రమంలో నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు మధ్యప్రదేశ్‌కు చెందిన సఫన్‌ఖాన్ (30), రామ్‌భరోస్ పటేల్ (27), జతిన్ హడా (18), రాజేశ్ అలియాస్ ఖన్నా అలియాస్ మామా (45)లను అరెస్ట్ చేశారు. అలాగే, చోరీ ఫోన్లను కొనుగోలు చేసిన ముంబైలోని గవాండీకి చెందిన సమీర్ అహ్మద్ షేక్ (38) కూడా సంకెళ్లు వేశారు. అతడి నుంచి ఇప్పటి వరకు రూ. 1.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఫోన్లను బంగ్లాదేశ్ తరలిస్తామని, గతంలోనూ వారితో అలాంటి ఒప్పందమే కుదుర్చుకున్నట్టు సమీర్ అహ్మద్ విచారణలో వెల్లడించారు. 


More Telugu News