తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డికి కోహ్లీ ఇచ్చిన సందేశం ఇదే..!

  • బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా తొలి టెస్టు
  • భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తెలుగుతేజం నితీశ్ 
  • అత‌నికి క్యాప్‌ను అందించిన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ 
  • దేశానికి చాలా కాలం ఆడాలి.. ఎన్నో విజ‌యాలు అందించాలంటూ నితీశ్‌కు కోహ్లీ మెసేజ్‌
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు అత‌నికి టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ క్యాప్‌ను అందించాడు. ఈ సందర్భంగా నితీశ్‌కు కోహ్లీ కీల‌క సందేశం ఇచ్చాడు. 

"నువ్వు ఇక్క‌డికి చేరుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డావు. ట్రైనింగ్‌లో నిన్ను గమనిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి రావడానికి అర్హుడివి. నువ్వు దేశానికి చాలా కాలం ఆడాలి. ఎన్నో విజ‌యాలు అందించాలి. ఫ‌లితంతో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా ఆడు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నీ తొలి మ్యాచ్‌ను ఆస్వాదించు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు అరంగేట్రం చేసిన ఈ క్షణం నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని నితీశ్‌తో విరాట్ చెప్పాడు.  

అటు నితీశ్ కుమార్ రెడ్డి కూడా త‌న ఆరాధ్యదైవమైన విరాట్ కోహ్లీ నుండి టెస్ట్ క్యాప్ అందుకోవ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. చిన్న‌ప్ప‌టి నుంచి కోహ్లీ ఆట‌ను చూసి పెరిగిన తాను, చివ‌రికి ఆయ‌న చేతుల మీదుగానే టెస్ట్ క్యాప్ అందుకోవ‌డం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని తెలిపాడు.

ఇక పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కీల‌క‌మైన‌ 41 ర‌న్స్ చేసి, టీమిండియా 150 స్కోర్ చేయ‌డంలో స‌హాయ‌ప‌డ్డాడు. ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జ‌ట్టు 67 ప‌రుగుల‌కే 7 వికెట్లు పారేసుకుంది. దీంతో తొలి టెస్టుపై జ‌స్ప్రీత్ బుమ్రా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించిన‌ట్లే క‌నిపిస్తోంది. 


More Telugu News