'రెహ‌మాన్‌తో బంధం' వార్త‌ల‌పై స్పందించిన మోహిని..!

  • రెహ‌మాన్, సైరా బాను దంప‌తులు ఇటీవ‌ల విడాకుల ప్ర‌క‌ట‌న‌
  • అదే రోజు బాసిస్ట్ మోహిని డే కూడా త‌న భ‌ర్త నుంచి విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ 
  • దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ 
  • తాజాగా వాటిపై త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందించిన మోహిని 
  • నిరాధార పుకార్ల‌పై త‌న శ‌క్తిని వెచ్చించ‌బోన‌ని వెల్ల‌డి
ఆస్కార్ అవార్డు విజేత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్, సైరా బాను దంప‌తులు త‌మ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఇటీవ‌ల విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన కాసేప‌టికే త‌న భర్త నుంచి విడిపోతున్న‌ట్లు బాసిస్ట్ మోహిని డే వెల్ల‌డించారు. ఈమె రెహ‌మాన్ మ్యూజిక్‌ గ్రూప్‌లో కీల‌క వ్య‌క్తి. గ‌త కొన్నేళ్లుగా ఆమె రెహ‌మ‌న్ ట్రూప్‌లో కొన‌సాగుతున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. 

తాజాగా వాటిపై మోహిని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందించారు. రెహ‌మాన్‌తో బంధం వార్త‌లను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో త‌న‌తో ఇంట‌ర్వ్యూల కోసం వ‌చ్చిన ప‌లు అభ్య‌ర్థ‌న‌లను తాను పూర్తిగా తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. అన‌వ‌స‌ర‌మైన, నిరాధార పుకార్ల‌పై త‌న శ‌క్తిని వెచ్చించ‌బోన‌ని మోహిని తెలిపారు. 

"ఇంట‌ర్వ్యూలు కావాలంటూ భారీగా విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. ఎందుకో నాకు తెలుసు. ఈ చెత్త‌కు ప్ర‌చార‌మివ్వాల‌న్న ఆసక్తి ఏమాత్రం లేదు. నా శ‌క్తిని రూమ‌ర్ల‌పై పెట్ట‌ద‌ల‌చుకోలేదు. ద‌య‌చేసి నా వ్య‌క్తిగ‌త‌ గోప్య‌త‌ను గౌర‌వించండి" అని మోహిని త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. 

ఇక అంత‌కుముందు రెహ‌మాన్ కుమారుడు అమీన్ కూడా బాసిస్ట్ మోహిని డేతో తన తల్లిదండ్రులు విడిపోవడాన్ని కలిపే నిరాధార పుకార్లను తీవ్రంగా ఖండించారు. అటు ఆయ‌న కుమార్తె రహీమా కూడా ఇదే విష‌య‌మై తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ప్రకటన విడుద‌ల చేశారు. ప‌నీపాటా‌లేని వారే ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాల‌ను నెత్తిన పెట్టుకుంటార‌ని ఆమె మండిప‌డ్డారు.


More Telugu News