ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. రంగంలోకి ఐసీసీ.. తొలగిపోనున్న ప్రతిష్టంభన!

  • వ‌చ్చే ఏడాది ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి  పాకిస్థాన్‌ ఆతిథ్యం 
  • త‌మ జ‌ట్టును పాక్‌కు పంపించ‌బోమ‌ని బీసీసీఐ స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • టీమిండియా పాకిస్థాన్ రావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్న పీసీబీ
  • భార‌త్ ప్ర‌తిపాదించిన హైబ్రిడ్ మోడ‌ల్‌కు కూడా పాక్ నో
  • ఈ వ్యవహారంపై ఈ నెల 26న ఐసీసీ అత్యవ‌స‌ర స‌మావేశం
వ‌చ్చే ఏడాది దాయాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై అనిశ్చితి కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా త‌మ జ‌ట్టును పాక్‌కు పంపించ‌బోమ‌ని బీసీసీఐ చెబుతోంది. అదే స‌మ‌యంలో టీమిండియా పాకిస్థాన్ రావాల్సిందేన‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప‌ట్టుబడుతోంది. భార‌త్ ప్ర‌తిపాదించిన హైబ్రిడ్ మోడ‌ల్‌ను కూడా పాక్ అంగీక‌రించ‌డం లేదు. దీంతో ఈ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. 

ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ క్రికెట్ క‌మిటీ (ఐసీసీ) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్రతిష్టంభనకు తెర‌దించాల‌నే ఉద్దేశంతో ఈ నెల 26న అత్యవ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారంపై తుది తీర్పును ప్రకటించడానికి ముందు ఐసీసీ వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీసీసీఐ, పీసీబీ ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నార‌ని ఇండియా టుడే పేర్కొంది.
 
ఈ సమావేశంలో చర్చించే కీలకాంశాలివే..
1. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు, ఇరు దేశాలు ఉన్న గ్రూప్స్‌ 
2. సెమీఫైనల్, ఫైనల్‌లను తటస్థ వేదికలో నిర్వహించడం
3. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తూనే ఉంటే, తర్వాత ఏం చేయాలి?
4. మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీని తటస్థ వేదికకు తరలించే అవకాశాలు
5. పాకిస్థాన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీపై ప్రతిష్టంభనను తొలగించేందుకు బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ అధికారులతో సమావేశమై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉందని క‌థనాలు వెలువ‌డిన‌ ఒక రోజు తర్వాత ఈ పరిణామం జర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉంటే.. వచ్చే ఏడాది టోర్నమెంట్ నిర్వహణపై అనిశ్చితి ఉన్నప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సుమైర్ అహ్మద్ సయ్యద్‌ను పీసీబీ గురువారం నియమించింది. ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ టోర్నమెంట్‌ను పూర్తిగా పాక్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు మ‌రోసారి బోర్డు వైఖరిని తెలియ‌జేశారు.


More Telugu News