నితీశ్ కుమార్ రెడ్డి ఫుల్ హ్యాపీ... కారణం ఇదే!

  • టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
  • అఫిషియల్ టీమిండియా క్యాప్ అందించిన కోహ్లీ
  • 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన నితీశ్
  • కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ అని వెల్లడి
ఏ యువ క్రికెటర్ అయినా జాతీయ జట్టులోకి అరంగేట్రం చేస్తే, సీనియర్ ఆటగాళ్లు, లేదా కోచ్ చేతుల మీదుగా అఫిషియల్ క్యాప్ అందుకోవడం ఆనవాయతీ. ఇవాళ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్యాప్ అందించాడు. దాంతో, నితీశ్ రెడ్డి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. 

పెర్త్ లో ఇవాళ టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి... తొలి మ్యాచ్ లోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ కు దిగిన ఈ తెలుగుతేజం 41 పరుగులు చేశాడు. 

ఇంకేముందీ... తన బ్యాటింగ్ ఐడల్ కోహ్లీ చేతుల మీదుగా క్యాప్ అందుకోవడం, బ్యాటింగ్ లో అందరికంటే మిన్నగా రాణించడాన్ని ఈ యువ ఆటగాడు శుభసూచకంగా భావిస్తున్నాడు. 

పెర్త్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ అని, అతడి చేతుల మీదుగా క్యాప్ అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. టీమిండియాకు ఆడాలన్నది తన కల అని, అలాంటిది ఇవాళ టెస్టు జట్టులోకి కూడా వచ్చేశానని, కోహ్లీ భాయ్ నుంచి క్యాప్ అందుకోవడం అద్భుతమైన ఘట్టం అని వివరించాడు.


More Telugu News