కాళేశ్వరం ప్రాజెక్టుపై సోమవారం నుంచి తదుపరి విచారణ

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్
  • సోమవారం నుంచి రోజుకు 14 మంది చొప్పున ఇంజినీర్ల విచారణ
  • ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులను ప్రశ్నించనున్న కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణలో భాగంగా వచ్చే సోమవారం నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఆనకట్టల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో పని చేసిన ఇంజినీర్లను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై విచారణ జరుపుతోంది. వచ్చే సోమవారం నుంచి రోజుకు 14 మంది చొప్పున ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.

కాంట్రాక్టర్లను, కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేసిన ఇతర వ్యక్తులను కూడా విచారించనున్నారు. బ్యారేజీల పనుల్లో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కమిషన్ దృష్టి సారించింది. ఇంజినీర్ల అంశాలు పూర్తయ్యాక ఆర్థిక అంశాలు, నిధులకు సంబందించిన వాటిపై దృష్టి సారిస్తారు.

కాగ్, విజిలెన్స్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అకౌంట్స్ సంబంధిత అధికారులను కూడా కమిషన్ విచారించనుంది. మరోవైపు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని నీటి పారుదల శాఖను కమిషన్ ఆదేశించింది.


More Telugu News