మీ ఫోన్​ మీపై నిఘా పెట్టిందా?... లైట్​ తీసుకోవద్దు, తెలుసుకునేదిలా!

  • మనకు తెలియకుండానే మన మాటలు వినేస్తున్న ఫోన్లు
  • మాటలను విశ్లేషించి మనమేం చేస్తున్నామనే దానిపై నిఘా
  • అందుకు తగినట్టుగా వెబ్ సైట్లు, యాప్ లలో యాడ్స్ చూపిస్తున్న వైనం
మీ ఫ్రెండ్ వచ్చాడు... ఆయనతో మీరు కాసేపు మాట్లాడారు... వచ్చే వారం బెంగళూరులో పని ఉందని, వెళ్లి రావాల్సి ఉందని మీ ఫ్రెండ్ తో అన్నారు... బెంగళూరులో హోటళ్లు ఎలా ఉంటాయి, ఫుడ్ ఎక్కడ బాగుంటుందని అతడిని అడిగారు... అతను ఏదో సమాధానం చెప్పాడు... కాసేపటికి అతను వెళ్లిపోయాడు... మరుసటి రోజు మీరు ఫేస్ బుక్ చూస్తున్నప్పుడు బెంగళూరులో మంచి హోటళ్లు ఇవేనంటూ ఓ ట్రావెల్ బుకింగ్ సైట్ ప్రకటన కనిపించింది... ఏదో న్యూస్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే... దానిలో పక్కన వచ్చే యాడ్స్ లోనూ బెంగళూరు సిటీ హోటళ్లు, అక్కడ మీరు స్టే చేయడానికి వీలయ్యే లాడ్జీల ప్రకటనలు కనిపించాయి!!

మీరేదో మీ ఫ్రెండ్ తో మాట్లాడారు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడమో, మరొకటో చేయలేదు. అయినా... ఆన్ లైన్ లో మీకు అవసరమైనట్టుగా యాడ్స్ ఎలా వచ్చాయి? ఇదే మన ఫోన్లు మనపై పెడుతున్న నిఘా. దీనినే ‘ఈవ్స్ డ్రాపింగ్’గా పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రముఖ ‘నార్డ్ వీపీఎన్’ సంస్థ టెక్ నిపుణులు చిన్న ప్రయోగం చేశారు. ఫోన్లలోని మైక్రో ఫోన్ల ద్వారా మన సంభాషణలన్నీ టెక్ సంస్థలకు చేరిపోతున్నాయని... ఫోన్లు మనపై నిఘా పెడుతున్నాయని తేల్చారు.

మరి మన ఫోన్ మనపై నిఘా పెట్టిందా, లేదా తెలుసుకోవడానికి నాలుగు దశల్లో చిన్న టెస్ట్ చేయాలని సూచిస్తున్నారు.

1. ఇంతవరకు లేని ఓ కొత్త టాపిక్ తీసుకోండి
మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయని, పోస్ట్ చేయని ఒక కొత్త టాపిక్ తీసుకోండి. మీకు సంబంధించి అది పూర్తి కొత్తగా... ఎన్నడూ చేయని పని, ఎన్నడూ వెళ్లని, మాట్లాడని ప్రదేశం అయి ఉండాలి.

2. ఆ టాపిక్ పై రెండు, మూడు రోజులు ఎక్కువగా మాట్లాడండి
మీ ఫోన్ ను మీ పక్కన పెట్టుకుని.. మీరు ఎంచుకున్న కొత్త టాపిక్ గురించి రెండు, మూడు రోజులు తరచూ మాట్లాడండి. ఉదాహరణకు ఏదైనా దేశం గురించి, అక్కడి నగరాలు, హోటళ్లు, టూరిస్టు ప్లేసుల గురించి మాట్లాడండి.

3. ఈ టాపిక్ పై ఇంటర్నెట్ సెర్చింగ్ వంటివి చేయొద్దు
ఈ రెండు, మూడు రోజుల పాటు మీరు ఎంచుకున్న టాపిక్ కు సంబంధించి... ఇంటర్నెట్ లో సెర్చింగ్, ఫేస్ బుక్, ఇతర యాప్ లలో పోస్టులు వంటివి అస్సలు చేయవద్దు. కేవలం ఫోన్ ను మీ పక్కన పెట్టుకుని ఆ టాపిక్ పై మాట్లాడాలి. మిగతా అంశాలకు సంబంధించి ఫోన్ ను మామూలుగానే వాడుతూ ఉండాలి.

4. ప్రకటనలను సరిగ్గా గమనించండి
టాపిక్ పై మాట్లాడటం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు... మీ ఫోన్ లో, దానితో లింక్ అయి ఉన్న స్మార్ట్ టీవీ, ఇతర పరికరాల్లో వచ్చే ప్రకటనలను సరిగ్గా గమనిస్తూ ఉండండి. మీరు ఓపెన్ చేసే వెబ్ సైట్లు, సోషల్ మీడియా యాప్స్ వంటి వాటిలోనూ యాడ్స్ ను కాస్త పరిశీలించండి.

ఒకవేళ మీరు మాట్లాడిన టాపిక్ కు సంబంధించి ప్రకటనలు (యాడ్స్) గనుక తరచూ కనిపిస్తూ ఉంటే... మీ ఫోన్ మీపై నిఘా పెట్టినట్టే. మీ సంభాషణలను వింటూ... అందులోని టాపిక్స్ ను యాడ్స్ కోసం వాడుతున్నట్టే.

ఈ నిఘా నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి?
మీ ఫోన్ లో ఎన్నో రకాల యాప్స్ వాడుతుంటారు. బ్యాంకింగ్ యాప్స్ నుంచి గేమ్స్, ఎంటర్ టైన్మెంట్ కోసం వాడేవీ ఉంటాయి. వాటిని ఇన్ స్టాల్ చేసినప్పుడు మైక్రోఫోన్, కెమెరా, స్టోరేజీ వంటి పర్మిషన్లు అడుగుతాయి. మనం పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటాం. అసలు చిక్కంతా ఇక్కడే ఉంటుంది.
ప్రముఖ కంపెనీల యాప్ లతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ గేమ్స్, సరదా యాప్ లు, యాడ్స్ పై లింకులను క్లిక్ చేయడం ద్వారా డౌన్ లోడ్ అయి ఇన్ స్టాల్ అయ్యే యాప్ లతో సమస్య.
  • ఇలాంటి యాప్ లకు ఇచ్చే పర్మిషన్ల ఆధారంగా మీ ఫోన్ తో మీపై నిఘా కొనసాగుతుంది.
  • అందువల్ల ముఖ్యమైన యాప్స్ మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్స్ కు పర్మిషన్లు ఇచ్చే ముందు పరిశీలించాలి.
  • అప్పుడప్పుడూ ఏయే యాప్స్ కు ఏ పర్మిషన్లు ఇచ్చామన్నది.. సెట్టింగ్స్ లోకి వెళ్లి పరిశీలించాలి.
  • అనవసర యాప్స్ కు ఇచ్చిన పర్మిషన్లను తొలగించాలి.
  • మీ ఫోన్ లో వాడే గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి వంటి వాయిస్ అసిస్టెంట్లలో హిస్టరీని డిలీట్ చేయాలి.
  • సెట్టింగ్స్ లో వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ లోకి వెళ్లి.. ఫోన్ లాక్ చేసి ఉన్నప్పుడు ధ్వనులు వినకుండా ‘ఆలో వెన్ లాక్ డ్’ ఆప్షన్ ను డిజేబుల్ చేయాలి.
  • యాప్స్, సాఫ్ట్ వేర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.
  • వీలైతే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవడం... వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్)లను వాడటం వంటివి చేస్తే... ఆన్ లైన్ నిఘా నుంచి రక్షణ ఉంటుంది.


More Telugu News