పెర్త్ టెస్టు: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి... ఆసీస్ 67-7

  • నేటి నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్
  • ఆట చివరికి 7 వికెట్లకు 67 పరుగులు చేసి కష్టాల్లో పడిన ఆసీస్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట చివరకు 7 వికెట్లకు 67 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆసీస్ విలవిల్లాడింది. ఏ దశలోనూ ఆసీస్ బ్యాటింగ్ కుదురుగా సాగలేదు. 

ముఖ్యంగా, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దాడులకు నాయకత్వం వహించి, కంగారూ టాపార్డర్ ను కకావికలం చేశాడు. బుమ్రా 4 వికెట్లతో ఆతిథ్య జట్టు వెన్నువిరిచాడు. బుమ్రా విసిరిన బుల్లెట్ బంతులకు ఆస్ట్రేలియన్ల వద్ద సమాధానం లేకపోయింది. మరో ఎండ్ లో మహ్మద్ సిరాజ్ కూడా 2 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను దెబ్బతీశాడు. కొత్త కుర్రాడు హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేసిన 19 (బ్యాటింగ్) పరుగులే అత్యధికం. కేరీ ఇంకా క్రీజులో ఉన్నాడు. అతడికి జోడీగా మిచెల్ స్టార్క్ 6 పరుగులతో ఆడుతున్నాడు.


More Telugu News