గత ఏపీ ప్రభుత్వ ఆర్థిక గణాంకాలను వెల్లడించిన కాగ్

  • ఆర్థిక నివేదిక విడుదల చేసిన కాగ్
  • 2022-23లో ఏపీ రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని వెల్లడి
  • ఏపీ రెవెన్యూ వ్యయం 26.45 శాతం పెరిగిందని వివరణ
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వ ఆర్థిక గణంకాలను విడుదల చేసింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. అదే సమయంలో ఏపీ రెవెన్యూ వ్యయం 26.45 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. 

2021-22తో పోల్చితే రెవెన్యూ లోటు 405 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.8,611 కోట్లు అని తన నివేదికలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.43,487 కోట్లు అని వెల్లడించింది. 

2021-22తో పోల్చితే ద్రవ్య లోటు 109 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. 2021-22లో ద్రవ్య లోటు రూ.25,013 కోట్లు అని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు రూ.52,508 కోట్లు అని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రెవెన్యూ లోటు భారీగా పెరగడానికి కారణం రాబడికి మించిన ఖర్చులేనని స్పష్టం చేసింది. 

2022-23లో మూలధన వ్యయం రూ.7,244 కోట్లు మాత్రమేనని వెల్లడించింది. 2022-23లో సబ్సిడీల మొత్తం రూ.23,004 కోట్లు అని, సబ్సిడీల్లో 88 శాతం విద్యుత్ రాయితీలేనని వివరించింది. 

2022-23లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.1.28 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నప్పటికీ, ఆ రుణాలను బడ్జెట్ లో చూపలేదని తెలిపింది. రూ.20,872 కోట్ల కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని, ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,015 కోట్ల కమీషన్ రాలేదని కాగ్ స్పష్టం చేసింది. 

అటు, జీఎస్డీపీలో ప్రభుత్వ రుణం రూ.27.05 శాతానికి పెరిగిందని, బడ్జెటేతర అప్పులతో కలిపి జీఎస్డీపీలో ప్రభుత్వ అప్పు 41.89 శాతం అని వెల్లడించింది.


More Telugu News