వరుసగా రెండో రోజూ పతనమైన అదానీ గ్రూప్ షేర్లు

  • అమెరికా అభియోగాలతో నిన్న ఒక్క రోజే అదానీ గ్రూప్ విలువ రూ. 2.2 లక్షల కోట్లు పతనం
  • నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం
  • ఇంత ఒత్తిడిలోనూ ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు
భారత బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతరులు దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న అమెరికా అభియోగాలతో భారత్ స్టాక్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తొలి రోజు అదానీ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ విలువ రూ. 2.2 లక్షల కోట్లు ఆవిరైంది. అమెరికా అభియోగాల తర్వాత అదానీతో కుదుర్చుకున్న విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్ట్‌తోపాటు జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్టు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో అదానీ కంపెనీ షేర్ల పతనం నేడు కూడా కొనసాగింది.  అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నాలుగు శాతం క్షీణించాయి. గతేడాది మే తర్వాత ఈ షేర్లు పతనం కావడం ఇదే తొలిసారి. అలాగే, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్‌మార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 3 నుంచి 10 శాతం పతనమయ్యాయి. మరోవైపు, ఏసీసీ సిమెంట్స్ షేర్లు 0.5 శాతం క్షీణించాయి. మరోవైపు, మార్కెట్లో ఇంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ అదానీకే చెందిన అంబుజా సిమెంట్స్‌తోపాటు ఎన్డీటీవీ షేర్లు ఒక్కోటి ఒక శాతం పెరగడం గమనార్హం.


More Telugu News