గుడిలో దొంగతనానికి వెళ్లిన మూర్ఛ రోగి.. చోరీ తర్వాత ఊహించని ట్విస్ట్

  • దొంగతనం పూర్తయ్యాక మూర్ఛ వచ్చి పడిపోయిన దొంగ
  • స్థానికులు గుర్తించి వెంబడించడంతో భయాందోళనలతో మూర్ఛ ఎటాక్
  • పోలీసులకు స్థానికుల సమాచారం.. చికిత్స అనంతరం స్పృహలోకి దొంగ
  • తోడుగా వచ్చిన దొంగ పరారీ
  • పశ్చిమ బెంగాల్‌లో ఆసక్తికర ఘటన
అతడొక దొంగ. ఒక ఆలయాన్ని చోరీకి టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకొని దొంగతనానికి వెళ్లాడు. ఆలయంలో పాత్రలు, స్టవ్, గ్యాస్ సిలిండర్‌ను దొంగిలించారు. ఇక పారిపోవాల్సిన సమయంలో ఇద్దరినీ స్థానికులు గుర్తించారు. పట్టుకునేందుకు వెంబడించారు. అయితే ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఇద్దరు దొంగల్లో ఒకరు మాత్రమే పారిపోయారు. మరో దొంగ అక్కడే నేలపై స్పృహ తప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన అతడు మూర్ఛ రోగినని చెప్పాడు. దొంగతనం చేసిన తర్వాత మూర్ఛ వచ్చిందని తెలిపాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా చుచురా ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది.

కాగా చికిత్స అనంతరం సదరు దొంగను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దొంగ జైలులో ఉన్నాడు. అతడు మూర్ఛ రోగి అని దర్యాప్తులో తేలింది. దొంగతనం తర్వాత పెద్ద సమూహం అతడిని వెంబడించడంతో భయాందోళనలకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగ డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడని తేలిందన్నారు. నిందితులు ఇద్దరూ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నైహతి వాసులని, ఇళ్లు, దేవాలయాలలో దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో హుగ్లీకి వచ్చారని వివరించారు. కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News