ఒక మీటరు పెరగనున్న సముద్ర నీటి మట్టం... కోట్లాది మందికి పొంచి ఉన్న ముప్పు

  • 2100 నాటికి సముద్ర మట్టంలో గణనీయమైన పెరుగుదల
  • అమెరికా తీర ప్రాంతంపై పెను ప్రభావం
  • భూగర్భ జలాలు పెరగడం కూడా సమస్యాత్మకం అవుతుందన్న పరిశోధకులు
వాతావరణ మార్పులు మానవాళికి ముప్పుగా పరిణమించనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, సముద్ర తీర ప్రాంత వాసులు ప్రమాదం ముంగిట ఉన్నారని వివరించారు. 

నేచురల్ క్లైమేట్ చేంజ్ జర్నల్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం... 2,100 నాటికి సముద్ర నీటి మట్టం ఒక మీటరు మేర పెరగనుందని, దీని ప్రభావం ఆగ్నేయ అట్లాంటిక్ తీర ప్రాంతం, నార్ ఫోక్, వర్జీనియా, మయామీ, ఫ్లోరిడా ప్రాంతాల్లో 1.4 కోట్ల మంది ప్రజలపై ఉంటుందని ఉందని తెలిపారు. 

తీవ్రస్థాయిలో సంభవించే వరదలతో భూమి కుంగిపోతుందని, బీచ్ లు జలమయం అవుతాయని వర్జీనియా టెక్ జియోసైన్స్ విభాగానికి చెందిన మనూచెర్ షిరాజాయ్ వెల్లడించారు. భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోవడం కూడా సమస్యాత్మకంగా మారుతుందని అన్నారు. 

ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం... కోట్లాది మంది నిరాశ్రయులవుతారని, కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని వివరించారు. భవిష్యత్ కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలన్న అవసరాన్ని ఈ అధ్యయనం సూచిస్తుందని షిరాజాయ్ పేర్కొన్నారు.


More Telugu News