తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: టీటీడీ ఈవో

  • టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ప్రెస్ మీట్
  • తిరుమలలో పటిష్ట మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు
  • ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ తయారుచేస్తున్నామన్న శ్యామలరావు
తిరుమలను పక్కా ప్రణాళికతో మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె. శ్యామలరావు తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని పరిపాలన భవనం మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక కేంద్రం తిరుమలలో మరింత పటిష్ట మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈవో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారుచేసి, అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

తిరుమలలో పాదచారులకు సౌకర్యంగా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు స్మార్ట్ పార్కింగ్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాత కాటేజీల పునర్నిర్మాణం, బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ కూడా ప్రాధాన్యతా అంశాలుగా ఉన్నాయని వెల్లడించారు.

రాబోయే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను రూపొందించేందుకు విశ్లేషణాత్మకమైన డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ నిపుణుడైన ఒక రిటైర్డ్ అధికారిని సలహాదారుగా నియమించినట్లు చెప్పారు.

తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కాటేజీలకు ప్రత్యేకంగా 150 పేర్లు పెట్టినట్లు తెలిపారు. కాటేజీ దాతలు తమకు నచ్చిన పేర్లను ఎంపిక చేసుకునేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని వివరించారు.

తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను వచ్చే రెండు, మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. తిరుమల ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో నిండిన ప్రదేశంగా నిలవడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని ఈవో స్పష్టం చేశారు.

"తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే మా ప్రధాన కర్తవ్యం"  అని ఈవో శ్యామలరావు తెలిపారు.


More Telugu News