పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్... హైకోర్టులో భార్య శృతి పిటిషన్

  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని శృతి పిటిషన్
  • అరెస్ట్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదన్న పట్నం శృతి
  • పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై ఆయన భార్య పట్నం శృతి హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్తను అరెస్ట్ చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో అనుసరించే నిబంధనలు పాటించలేదన్నారు.

ఈ సందర్భంగా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తన పిటిషన్‌లో ఉదహరించారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె.నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్‌ను చేర్చారు.

ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు: పబ్లిక్ ప్రాసిక్యూటర్

తన అరెస్టును సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. సంబంధిత వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందించారు.


More Telugu News