అదానీపై లంచం కేసు ఎఫెక్ట్.. నిమిషాల వ్యవధిలోనే రూ.2.60 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు!

  • అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం, మోసపూరిత కుట్ర కేసు నమోదవడంతో తీవ్ర నష్టాలు
  • గురువారం మార్కెట్లు ఆరంభంలోనే లోయర్ సర్క్యూట్లను తాకిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు
  • రూ.14,24,432.35 కోట్ల నుంచి రూ.11,91,557.79 కోట్లకు దిగజారిన కంపెనీ ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్
భారీ కాంట్రాక్టులు దక్కించుకొని లాభపడేందుకుగానూ భారతీయ అధికారులకు దాదాపుగా రూ.2,236 కోట్ల భారీ ముడుపులు చెల్లించడానికి అంగీకరించారంటూ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందంటూ వార్తలు వెలువడడం అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇవాళ (గురువారం) మార్కెట్ ప్రారంభ సెషన్‌లో అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు అమాంతం పతనమయ్యాయి. దాదాపు అన్ని కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్‌ స్థాయులకు పడిపోయాయి. సుమారు 20 శాతం మేర షేర్లు క్షీణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్‌తో పాటు అన్ని కంపెనీల షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

తీవ్ర అమ్మకాల ఒత్తిడితో అదానీ గ్రూప్‌నకు చెందిన 10-లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ. 2.60 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ మంగళవారం రూ.14,24,432.35 కోట్లుగా ఉండగా గురువారం  రూ.11,91,557.79 కోట్లకు దిగజారింది. దీనిని బట్టి గురువారం ఆరంభ సెషన్‌లో ఇన్వెస్టర్లు దాదాపు రూ.2.60 లక్షల కోట్ల మేర నష్టపోయారు.

అదానీ గ్రూప్‌కు చెందిన తొలి కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అత్యధికంగా వాల్యుయేషన్‌ను కోల్పోయింది. ఈ కంపెనీ షేర్లు 20 శాతం దిగజారాయి. దీంతో మంగళవారం రూ. 2,820.2 వద్ద షేర్ విలువ గురువారం గురువారం రూ. 2256.2 స్థాయికి పతనమైంది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ ఒక్క రోజే రూ.61,096.85 కోట్లు తగ్గి రూ.2,60,406.26కి పడిపోయింది.

అదానీ పోర్ట్స్ షేర్లు 20 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు 19 శాతానికి పైగా, అదానీ పవర్ లిమిటెడ్ షేర్లు 18 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 20 శాతం, అదానీ విల్మార్ లిమిటెడ్ షేర్లు 10 శాతం.. ఇలా భారీ నష్టాలను చవిచూశాయి. అంతేకాదు... అదానీ గ్రూపు పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీల షేర్లు కూడా భారీ నష్టపోయాయి. అంతేకాదు అదానీ గ్రూపునకు భారీగా రుణాలు ఇచ్చిన ఎస్‌బీఐ షేర్లు కూడా గురువారం పతనమయ్యాయి.


More Telugu News