పాండ్యా అభిమానులకు షాక్.. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం!

  • ఐపీఎల్ గత సీజన్‌లో లక్నో జట్టుపై స్లో ఓవర్ రేట్ నమోదు
  • ముంబై కెప్టెన్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం.. రూ. 30 లక్షల జరిమానా
  • ఆ సీజన్‌లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో నిషేధం అమలు
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరోమారు అగ్రస్థానాన్ని అలంకరించిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అంతలోనే ఓ బ్యాడ్ న్యూస్ పలకరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న పాండ్యా రానున్న ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడకుండా ఐపీఎల్ అతడిపై నిషేధం విధించింది.

గత సీజన్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అయితే, ఆ సీజన్‌లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే దానిని అమలు చేయనున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌ ఆడకుండా పాండ్యాపై నిషేధం విధించారు. ఈ సీజన్‌లో పాండ్యా కొత్త జట్టుతో బరిలోకి దిగినా నిషేధం మాత్రం అమల్లోనే ఉంటుంది. 

ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ముంబైకి ఇది మూడోసారి. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతోపాటు రూ. 30 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ అతడు బరిలోకి దిగకూడదు. ఇక, ఆ మ్యాచ్‌లోని ఒక్కో ఆటగాడిపై రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. 


More Telugu News