సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

  •  ఫిబ్రవరి 15, 2025 నుంచి మొదలు కానున్న పరీక్షలు
  • ఇంగ్లిష్ మొదటి సబ్జెక్ట్‌గా 10వ తరగతి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పరీక్షలు ప్రారంభం
  • 86 రోజులు ముందుగానే డేట్‌షీట్ 2025 ప్రకటించిన సీబీఎస్ఈ
సీబీఎస్ఈ డేట్‌షీట్ 2025 విడుదలైంది. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ను సీబీఎస్ఈ బుధవారం పొద్దుపోయాక విడుదల చేసింది. ఫిబ్రవరి 15, 2025న 10వ, 12వ తరగతుల ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం... ఇంగ్లిష్ మొదటి సబ్జెక్ట్‌గా 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. అయితే 12వ తరగతి పరీక్షలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్ట్‌తో మొదలవుతాయి. సీబీఎస్ఈ.గవ్.ఇన్‌ (cbse.gov.in) పోర్టల్‌పై పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మొదటిసారిగా పరీక్షల ప్రారంభానికి దాదాపు 86 రోజులు ముందుగానే షెడ్యూల్ ప్రకటించామని సీబీఎస్ఈ పేర్కొంది. గతేడాదితో పోల్చితే 23 రోజులు ముందుగా పరీక్షల తేదీ షీట్‌ను విడుదల చేశామని అధికారిక ప్రకటనలో తెలిపింది. పాఠశాలలు సకాలంలో ఎల్‌వోసీ సమర్పించడంతో ఇంత త్వరగా షెడ్యూల్ ప్రకటించడం సాధ్యమైందని వివరించింది.

కాగా 10వ, 12వ తరగతులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సీబీఎస్ఈ ఇటీవలే విడుదల చేసింది. 10వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1, 2025 నుంచి మొదలవుతాయి. 12వ తరగతి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది.


More Telugu News