అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్‌పై చంద్రబాబు ప్రశంసలు

  • దీపం ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నార‌ని అభినంద‌న‌
  • రేష‌న్‌, ఆధార్ కార్డు ఆధారంగానే ఉచిత గ్యాస్ 
  • ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పామన్న సీఎం
దీపం ప‌థ‌కం-2ను రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మ‌ర్ధంవంతంగా అమ‌లు చేస్తున్నార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. బుధ‌వారం జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... గ‌తంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన రామ్‌నాయ‌క్ అనే కేంద్ర మంత్రిని, ప్ర‌ధాని వాజ్‌పెయ్‌ని మెప్పించి ఆ రోజుల్లోనే దీపం ప‌థ‌కంను ఇంటింటికీ అమ‌లు చేసిన పార్టీ టీడీపీ అన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో చెప్పామని... ఆ దిశ‌గా ముందుకెళుతున్నామ‌న్నారు.

కొంద‌రు తెలియ‌నివాళ్లు గ్యాస్ ఎక్క‌డిచ్చార‌ని మాట్లాడుతున్నార‌ని... ఇది క్యాష్ కాదు చేతికివ్వ‌డానికి... గ్యాస్ అని చ‌లోక్తి విసిరారు. కేవ‌లం రేష‌న్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకునే వారంద‌రికీ ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకుని... విమ‌ర్శ‌లు మానుకోవాలని హితవు పలికారు.


More Telugu News