గురుకుల పాఠశాలలా? లేక నరకకూపాలా?: హరీశ్ రావు

  • వాంకిడిలో ఫుడ్ పాయిజన్‌తో ఓ విద్యార్థి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడని వెల్లడి
  • నారాయణపేట జిల్లాలో 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు వెల్లడి
  • స్కూళ్లలో పాఠాల కంటే ప్రాణాలతో బయటపడితే చాలు అనే స్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం
గురుకుల పాఠశాలలా? లేక నరకకూపాలా? ప్రభుత్వ పాఠశాలలా? లేక ప్రాణాలు తీసే విషవలయాలా? అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. అలాగే, ఈరోజు నల్గొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని విమర్శించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతోందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలనే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకు వచ్చిందన్నారు.

మీరు విజయోత్సవాలు జరుపుతోంది ఇందుకేనా? అని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? అని మండిపడ్డారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


More Telugu News